telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ

నగరాలకు పొంచిఉన్న.. నీటి సమస్య..

water shortage in cities very soon

అభివృద్ధి పేరుతో నగరాలను అందంగా అయితే తయారుచేస్తున్నారు గాని, అక్కడ సౌకర్యాలను మాత్రం కల్పించడం వీలుపడటంలేదు ప్రభుత్వాలకు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు, అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అవటంతో, వలసలు జనసాంద్రత పెరిగి, అవసరాలకు తగ్గట్టుగా వనరులు సరఫరా చేసే స్థితి వచ్చేకొద్దీ అడుగంటిపోతుంది. అందులో ప్రాథమిక అవసరాలలో ఒకటైన నీటి సమస్య వ‌చ్చే ఏడాదిలోగా సుమారు 21 న‌గ‌రాల్లో తీవ్ర రూపం దాల్చ‌నున్న‌ది. 2018 నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇదే విష‌యాన్ని వెల్ల‌డించింది. ఈ ఏడాది రుతుపవనాల ఆగమనం ఆలస్యం కావడంతో దేశంలోని పలు ప్రాంతాలు నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల్లో దాదాపు సంక్షోభ స్థితి నెలకొంది. దేశంలోని దాదాపు 50 శాతం ప్రాంతాలలో నీటి కొరత ఏర్పడినట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

దేశంలోని దాదాపు 55 శాతం వ్యవసాయయోగ్యమైన భూమి వర్షాలపై ఆధారపడి ఉన్నది. రుతుపవనాలు ఆలస్యం కావడంతో వానాకాలం పంటల సాగు ఆలస్యమైంది. భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెలలో ఇప్పటికే 24 శాతం లోటు వర్షపాతం నమోదైంది. వర్షాభావం పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాల వినియోగం పెరిగింది. 2007 నుంచి 2017 మధ్య భూగర్భజలాలు 61 శాతం తగ్గిపోయాయి. గుజరాత్‌లో దశాబ్దానికి 20 మీటర్ల చొప్పున అడుగంటుతున్నాయి. మహారాష్ట్రలోని యావత్మాల్, చంద్రాపూర్, అమరావతి, అకోలా, బీడ్ జిల్లాల్లోని 9వేల కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు నాలుగు మీటర్ల కన్నా దిగువకు వెళ్లిపోయాయి.

కేంద్ర నివేదికల ప్రకారం, 2001- 2011 మధ్య దేశంలో వార్షిక తలసరి నీటి లభ్యత 15 శాతం పడిపోయింది. 2025 నాటికి మరో 13 శాతం, 2050 నాటికి మరో 15 శాతం పడిపోగలదని అంచనా. అంటే 30 ఏండ్ల తర్వాత ప్రతి భారతీయుడికి ఏడాదికి 11 లక్షల లీటర్ల నీరు మాత్రమే లభ్యమవుతుంది. ప్రపంచ ప్రమాణాల ప్రకారం, తలసరి నీటి లభ్యత 10 లక్షల లీటర్ల కన్నా తగ్గితే.. ఆ దేశం నీటి కొరతను ఎదుర్కొంటున్నట్టు. రానున్న కాలంలో భారతదేశ జనాభా చైనాను అధిగమించనుంది. దీంతో దేశంలో జల సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. నివాస ప్రాంతాలకు సమీపంలో స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేని దేశాల జాబితాలో భారత్‌ను వాటర్ ఎయిడ్ సంస్థ ఇప్పటికే మొదటి స్థానంలో చేర్చింది. దాన్నిబట్టే నీటి కొరత ఏ స్థాయిలో ఉందొ తెలుసుకోవచ్చు.

Related posts