telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా”పై “వార్” ఎఫెక్ట్… 3వ స్థానం…!?

Syeraa

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు. ఉత్తరాంధ్ర, నెల్లూరు వంటి ప్రాంతాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పినా కీలకమైన నైజాం ఏరియాలో మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తొలి రోజు కలెక్షన్స్ విషయంలో “సాహో”, “బాహుబలి-2” తర్వాత మూడో స్థానానికి “సైరా” పరిమితమైంది. దానికి కారణం అదే రోజు విడుదలైన “వార్” సినిమా. “వార్” ప్రభావం “సైరా”పై ఉత్తరాదినే ఉంటుందని అందరూ భావించారు. అయితే నైజాం ఏరియాలో కూడా “వార్” ప్రభావం గట్టిగానే పడింది. తొలి రోజు ఒక్క హైదరాబాద్‌లోనే “వార్” సినిమావి 200కు పైగా షోలు వేశారు. దీంతో ఈ ప్రభావం “సైరా”పై పడింది. లేకపోతే “సాహో”ని “సైరా” కచ్చితంగా దాటేసి ఉండేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తొలి రోజు “సాహో” సినిమా నైజం ప్రాంతంలో రూ.9.40 కోట్లు వసూలు చేసి తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో “బాహుబలి-2” (రూ. 8.90 కోట్లు), “సైరా” (రూ.8.10 కోట్లు) ఉన్నాయి. “సాహో”, “బాహుబలి-2” సినిమాలకు ఎలాంటి పోటీ లేకపోవడం కలిసొచ్చింది.

Related posts