telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

బంగ్లా ఆటగాళ్లకు .. గెలిచే అవకాశాలు ఎక్కువే.. : లక్ష్మణ్ వీవీఎస్

vvs lakshman on bangladesh-india series

బంగ్లాదేశ్ సిరీస్ లో భాగంగా మూడు టీ 20లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ పై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో భారత్ ను ఓడించడానికి బంగ్లాదేశ్ కు ఇంతకంటే అద్భుతమైన అవకాశం రాదని లక్ష్మణ్ వెల్లడించాడు. బంగ్లాపులులు గాండ్రించడానికి ఇదే సరైన సమయమంటూ లక్ష్మణ్ కామెంట్ చేశాడు. నవంబర్ నాలుగు నుంచి జరుగబోయే మూడు మ్యాచుల టీ20 సిరీస్ కోసం బీసీసీఐ పూర్తిగా యువజట్టును ఎంపిక చేసింది. ఈ సిరీస్ కు కెప్టెన్ కోహ్లీ దూరంగా ఉండగా.. రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలను మోస్తున్నాడు. కోహ్లీతో పాటు బుమ్రా కూడా ఈ సిరీస్ కు అందుబాటులో లేకపోవడం టీమిండియాకు బలహీనంగా మారే అవకాశముందని లక్ష్మణ్ విశ్లేషించాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ బలంగా ఉంది. వారు నిలకడ ప్రదర్శిస్తే అద్భుతమైన విజయాలు సొంతం చేసుకునే అవకాశముంది. వారికి ప్రస్తుతం ఉన్న సమస్యల్లా బౌలింగ్ విభాగం తోటే ముస్తఫిజుర్ రెహ్మాన్ తో పాటు మిగిలిన బౌలర్లు కష్టపడితే భారత్ ను ఓడించే అవకాశం వారికి లభిస్తుంది. టీమిండియాపై స్వదేశంలో గెలవడానికి వారికి ఇంతకన్నా మంచి అవకా:శం లేదు అని లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు.

భారతజట్టులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ లు మినహా మిగిలిన వారంతా యువకులే కావడంతో మిడిలార్డర్ కొంచెం బలహీనంగా మారింది. ఈ సిరీస్ లో జరిగే మ్యాచులన్నింటికి స్పిన్ పిచ్ లే అతిథ్యమివ్వనుండటంతో చాహల్, వాషింగ్టన్ సుందర్ లాంటి బౌలర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం దొరకుతుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఈ సిరీస్ లో భారత్ 2-1 తేడాతో గెలవాలనే కోరుకుంటున్నా. కానీ బంగ్లాదేశ్ కు కూడా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వారు చరిత్రను సృష్టించే అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నా అని లక్ష్మణ్ అన్నాడు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ భారతగడ్డపై టెస్టులు, వన్డేలు, టీ20 సిరీసుల్లో ఒక్కటి కూడా నెగ్గలేదు.

Related posts