telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

వివేకా హత్య కేసు : బినామీలే .. కడతేర్చారు.. !

YS Vivekananda Reddy's letter accusing Prasad

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు ఆస్తి తగాదాలే కారణం, అది కూడా బినామీలుగా ఉన్న అనుచరులే ఆయన్ని హత్య చేయించారు.. ఇప్పుడు పోలీసులు ఈ అంశాలనే దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. పరమేశ్వర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అనే వారు సూత్రధారులైతే.. పాత్రధారిగా చంద్రశేఖర్‌రెడ్డి అండ్‌ గ్యాంగ్‌ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అలాగే ఈ కేసులో గురువారం మరో ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఓ స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 40 మందిని రహస్య ప్రదేశాల్లో విచారిస్తున్నారు. కేసు కొలిక్కి వస్తుండటంతో ఒకటి రెండురోజుల్లోనే అధికారికంగా అరె్‌స్టలు చూపించే అవకాశం ఉన్నట్లు పోలీస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

వివేకాకు సింహాద్రిపురం, బలపనూరు, బెంగళూరు, పులివెందుల తదితర ప్రాంతాల్లో భారీగానే స్థిరాస్తులు ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో ఉన్న ఆస్తులపై కన్నేసిన ముఖ్య అనుచరులు వాటి ఆర్థిక లావాదేవీలలో రూ.1.50 కోట్లకు వివాదం నెలకొందని అంటున్నారు. హత్యకు 15 రోజుల ముందు చోటుచేసుకున్న ఈ వివాదం చంపేంత వరకు వెళ్తుందని వివేకా కూడా ఊహించలేదని చెబుతున్నారు. అందుకే భద్రతా చర్యలు తీసుకోకుండా హంతకులైన అనుచరుల చుట్టూ వివేకా తిరుగుతూ వచ్చారని తెలిసింది. ఆయనకు ముఖ్య అనుచరులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలు వివేకా ఆస్తులకు బినామీలుగా వ్యవహరించే వారని పోలీసులు గుర్తించారు.

parameswarareddy on viveka murderపోలీసులు చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన రాత్రి 11.30గంటల ప్రాంతంలో చిన్న అనే వ్యక్తికి చెందిన స్కార్పియో వాహనంలో అతను పులివెందులలో తిరిగినట్లు సీసీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా పోలీసులు చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ఓ న్యాయవాది వద్ద గుమస్తాగా పనిచేస్తూ చట్టంలోని లొసుగులు తెలుసుకుని హత్యలకు పాల్పడేవాడని పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే.. పోలీసులు అదుపులోకి తీసుకోకముందు పరమేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. హత్య ఇంటి దొంగల పనే అని పేర్కొంటూ.. ఆ ఇంటి దొంగలెవరో త్వరలోనే తెలుస్తుందని నర్మగర్భంగా చెప్పారు. పరమేశ్వర్‌రెడ్డికి ఈ హత్య గురించి తెలుసు కాబట్టే అలా అన్నాడని, విచారణలో ఆ మేరకు పోలీసులు వివరాలు సేకరించారని తెలుస్తోంది.

హత్య అనంతరం ఎర్ర గంగిరెడ్డి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నించాడని గుర్తించిన పోలీసులు, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆరా తీసినట్లు సమాచారం. అలాగే జగన్‌, అవినాశ్‌లకు అత్యంత ఆప్తుడుగా భావించే దొడ్లవాగుకు చెందిన శంకర్‌రెడ్డిని, ఎర్ర గంగిరెడ్డి ముఖ్య అనుచరుడు నాగప్ప కుమారుడైన శివను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్‌రెడ్డి తిరిగిన స్కార్పియోను స్వాధీనం చేసుకున్నారు.

Related posts