telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ షో నుంచి బయటకు వచ్చాక ఫ్రెండ్స్ అందరూ దూరమయ్యారు : వితికా

Vithika

నటుడు వరుణ్ సందేశ్ భార్య వితికా షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సామజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తన భర్త వరుణ్‌ సందేశ్‌తో కలిసి తాను రియాల్టీ షోలో పాల్గొన్నానని, అందులో నుంచి బయటకు వచ్చేవరకు చాలా ధైర్యవంతురాల్ని అనుకునేదాన్నని చెప్పింది. అయితే, ఆ షోలో నుంచి బయటకు వచ్చాక తనకు చాలా విషయాలు తెలిశాయని తెలిపింది. తమ గురించి ప్రేక్షకులు ఏ విధంగా చర్చించుకుంటున్నారో, నెగటివ్‌ గా ఎలా ట్రోలింగ్స్‌ చేస్తున్నారో తనకు తెలిసిందని చెప్పింది. వాటిన్నిటిని గురించి తెలుసుకుని తన కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో ఆ షో నుంచి బయటకువచ్చాకే తెలిసిందని పేర్కొంది. దీంతో తాను డిప్రెషన్‌లోకి వెళ్లానని, తనకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేయడానికి కూడా భయపడ్డానని చెప్పింది. ఒకవేళ తాను ఫొటోలు షేర్ చేస్తే వాటిని చూసి ఏ విధంగా స్పందిస్తారోనని భయపడేదాన్నని చెప్పింది. ఆ షోలోకి వెళ్లేంత వరకు తనతో చాలా చక్కగా మాట్లాడిన తన ఫ్రెండ్స్ అందరూ ఆ కార్యక్రమం చూసి తనకు దూరమయ్యారని, ఆ సమయంలో తన కుటుంబం మాత్రమే తనకు అండగా ఉందని, తనకు మద్దతుగా నిలిచి సాధారణ స్థితిలోకి తీసుకొచ్చిందని చెప్పింది. మనకు ఎప్పటికైనా తోడుగా ఉండేది మన కుటుంబమేనన్న విషయం దీని ద్వారా తనకు తెలిసిందని, ఎయిడ్స్‌, కేన్సర్‌ల కంటే డిప్రెషన్‌ అతి పెద్ద జబ్బని ఆమె వ్యాఖ్యానించింది. తనలా మరొకరు బాధను అనుభవించకూడదనే తాను ఈ విషయాలు చెబుతున్నానని, ఇతరుల గురించి నెగటివ్‌గా కామెంట్లు చేసేటప్పుడు నెటిజన్లు ఆలోచించాలని చెప్పుకొచ్చింది వితికా.

Related posts