telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా బయోపిక్ లో ఆ స్టార్ హీరో నటించాలి : విశ్వనాథన్ ఆనంద్

Vishwanathan-Anand

బయోపిక్‌ల హవా సినీపరిశ్రమలో ఇంకా కొనసాగుతూనే ఉంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవిత నేపథ్యాలని వెండితెరపై చూపించి మంచి విజయాలు సాధిస్తున్నారు మేకర్స్. అందుకే ప్రముఖుల జీవితాలను తెరపై ప్రేక్షకులకు చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు దర్శకనిర్మాతలు. ఇప్ప‌టికే తెలుగులో సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి లెజెండ్స్ బ‌యోపిక్స్ వ‌చ్చాయి. ఇందులో సావిత్రి బ‌యోపిక్ మ‌హానటి సంచ‌ల‌న విజ‌యం సాధించింది కూడా. ఈ నేపథ్యంలో ప్రముఖ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ జీవితకథ ఆధారంగా కూడా ఓ బయోపిక్ రాబోతోందని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన విశ్వనాథన్ ఆనంద్ తన బయోపిక్ గురించి స్పందించారు. “నా బయోపిక్ తెరకెక్కే విషయంలో నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అయితే నా పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కనిపిస్తేనే బాగుంటుంది. ఆయన గొప్ప నటుడు. అలాగే చదరంగంపై ఆయనకు మంచి పట్టు కూడా ఉంది. అందుకే ఆయన నా పాత్రలో నటించాలని కోరుకుంటున్నా. ఆయన ఒప్పుకుంటేనే నా బయోపిక్ తెరకెక్కాలని ఆశిస్తున్నాను” అని ఆనంద్ అన్నారు.

Related posts