telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఎలాగైనా వలసలు ఆపేదిశగా .. ట్రంప్, వీసాల దరఖాస్తు ఫీజు పెంపు..

visa application fee raised

ఇప్పటికే హెచ్1బీ వీసాల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న అమెరికా మరో పిడుగు వేసింది. యూఎస్‌కు ఉద్యోగుల్ని పంపే ఇండియన్ ఐటీ కంపెనీలపై మరింత ఆర్థిక భారం మోపేందుకు సిద్ధమైంది. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజును పెంచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసినట్లు యూఎస్ లేబర్ సెక్రటరీ ప్రకటించారు. అమెరికా యువత కోసం హెచ్1బీ వీసా దరఖాస్తు రుసుం పెంచాలని అగ్రరాజ్యం భావిస్తోంది. వారికి సాంకేతిక అంశాల్లో శిక్షణనిచ్చేందుకు అవసరమైన అప్రెంటీస్ నిధులు పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ కార్మిక మంత్రి అలెగ్జాండర్ అకోస్టా చెప్పారు.

దీనికి సంబంధించి 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేశారు. హెచ్1బీ వీసా అప్లికేషన్ ఫీజు ఎంత మేర పెంచాలనుకుంటున్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఏయే కేటగిరీలోని దరఖాస్తులకు ఈ పెంపు వర్తిస్తుందన్న వివరాలను అకోస్టా వెల్లడించలేదు. అయితే హెచ్ 1బీ వీసాపై అమెరికా వెళ్లేవారిలో మెజార్టీ ఉద్యోగులు భారతీయులే. ఈ నేపథ్యంలో దరఖాస్తు రుసుము పెంచితే ఆ ప్రభావం ఇండియన్ ఐటీ రంగంపై ఎక్కువగా పడనుంది. ఫలితంగా కంపెనీలు అదనపు ఆర్థిక భారాన్ని భరించాల్సి ఉంటుంది.

డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా అధికారం చేపట్టిన నాటి నుంచి హెచ్1బీ వీసాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అమెరికాలో విదేశీ ఉద్యోగులు పెరిగిపోతున్నారని, ఫలితంగా అమెరికన్లు నష్టపోతున్నారని వీసా నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఆరున్నర లక్షల మంది విదేశీయులు పనిచేస్తుండగా.. హెచ్1బీ వీసాలపై పనిచేస్తున్న వారిలో ఎక్కువ మంది చైనా, భారత్‌ నుంచి వెళ్లినవారే కావడం విశేషం.

Related posts