telugu navyamedia
క్రీడలు

విరాట్ కోహ్లీ 100వ టెస్టు : ఇది ఎంతో ప్రత్యేకం..

భారత్​ తరఫున వంద టెస్టులు ఆడిన 12వ భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమయ్యాడు..మొహాలీలో భారత్-శ్రీలంక టెస్టు ఈ చరిత్రకు సాక్ష్యమివ్వనుంది. వేలాది మంది అభిమానులు సాక్షులుగా ఉంటారు. ఈ టెస్టుపై అభిమానుల్లో అత్యుత్సాహం నెలకొని ఉంది.

ఇది ఎంతో ప్రత్యేకం.. విరాట్ కోహ్లీ

“ఇది నాకు ప్రత్యేకమైన క్షణం. నా భార్య ఇక్కడ ఉంది. అలాగే నా సోదరుడు కూడా ఇక్కడే ఉన్నాడు. అందరూ చాలా గర్వంగా ఉన్నారు. BCCIకి కూడా ధన్యవాదాలు.” విరాట్ కోహ్లీ

వందో టెస్టుకు ముందు విరాట్‌ కోహ్లీ మాట్లాడిన వీడియోను బీసీసీఐ గురువారం సోషల్‌ మీడియాలో ఉంచిన సంగతి తెలిసిందే. వంద టెస్టులు ఆడతానని అస్సలు అనుకోలేదు. ఇదో సుదీర్ఘ ప్రయాణం. ఆ వంద టెస్టుల మైల్‌స్టోన్‌ కోసం మేమెంతో క్రికెట్‌ ఆడాం. ఎంతో అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాను. వందో టెస్టు ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతా భావంతో ఉన్నాను. దేవుడు నాపై దయ చూపించాడు. నా ఫిట్‌నెస్‌ కోసం ఎంతో శ్రమించాను. ఇది నాకు, నా కుటుంబానికి, నా కోచ్‌కు అత్యంత గొప్ప సందర్భం. ఇందుకు వారెంతో సంతోషిస్తారు. గర్వపడతారు’ అని విరాట్‌ అన్నాడు.

ఆస్ట్రేలియాలో ఆ సెంచరీ చాలా ప్రత్యేకం.. జూన్ 2011లో వెస్టిండీస్‌తో జరిగిన కింగ్‌స్టన్ టెస్టులో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి, తొలి టెస్టు మ్యాచ్‌లలో విజయం సాధించలేకపోయాడు. అయితే కోహ్లీ ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో సెంచరీ సాధించినప్పుడు, అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. ఆ సెంచరీని గుర్తు చేసుకుంటూ కోహ్లీ మాట్లాడుతూ.. ‘నా తొలి టెస్టు సెంచరీ నాకు ఇంకా గుర్తుంది. అది ఎల్లప్పుడూ నాకు ప్రత్యేకంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలో అది పూర్తి చేయడం మరింత ప్రత్యేకమైనది’ అంటూ చెప్పుకొచ్చాడు.

టెస్టు క్రికెట్‌లో 8,000 పరుగుల మార్క్‌కు దగ్గరగా ఉన్న కోహ్లీ, “నేను చాలా అదృష్టవంతుడిని, ఎందుకంటే క్రికెటర్లకు అలాంటి అవకాశం చాలా అరుదుగా లభిస్తుంది. నేను దానిని పొందాను. నేను ఈ ఫార్మాట్‌కు నా సర్వస్వం ఇచ్చాను. నా శక్తి మేరకు బాధ్యతను నిర్వర్తించాను’’ అని అన్నాడు.

మ‌రోవైపు.. పంజాబ్​లోని ఐఎస్​ బింద్రా స్టేడియానికి అభిమానులు ఉత్సాహంగా తరలివచ్చారు. ఈ మ్యాచ్​కు 50శాతం ప్రేక్షకులను అనుమతించింది బీసీసీఐ. అలాగే ఇది శ్రీలంక ఆడుతున్న 300వ టెస్టు కావడం విశేషం.

Related posts