telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

విశాఖలో .. విషజ్వరాలు విజృంభణ.. ఇంటికొకరు బాధితులే..

viral fevers in visakha manyam areaviral fevers in visakha manyam area

విశాఖ జిల్లా, మన్యం ప్రాంతంలో మరోసారి విష జ్వరాలు ప్రతాపం చూపిస్తున్నాయి. జి-మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయతీ పరిధి ఉర్లమెట్టలో 50 మంది, చింతలగొందిలో 10 మంది గిరిజనులు జ్వరాలతో బాధపడుతున్నారు. వీరికి ఎఎన్‌ఎం వచ్చి మందులు ఇచ్చినా జ్వరాలు అదుపులోకి రాలేదు. అయినా అధికారులు ఈ గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయలేదు. ఈ రెండు గ్రామాల్లో రెండు నెలల వ్యవధిలో పది మంది అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు.

వారం రోజుల వ్యవధిలో ఉర్లమెట్టలో 50 మందికి పైగా గిరిజనులు జ్వరాలతో మంచాలపై మూలుగుతున్నారు. ఈ గ్రామంలో 55 కుటుంబాలు, 270 మది జనాభా ఉండగా, ప్రతి ఇంటిలోనూ జ్వరపీడుతులున్నారు. ఉర్లమెట్టలో అందరికీ మందులిచ్చే సిహెచ్‌డబ్ల్యూ కొండపల్లి సింహాచలం, మాజీ సర్పంచి పల్లాసి కుసులమ్మ, ఆమె కుమార్తె మూడు నెలల పాప కూడా జ్వరాలతో బాధపడుతున్నారు. ఉర్లమెట్టలో మూడేళ్ల లోపు వారు 10 మంది, 50ఏళ్లు పైబడిన వృద్ధులు 20 మంది జ్వరంతో బాధపడుతున్నారు. అలాగే చింతలగొందిలో పది మంది జ్వర పీడితులున్నారు.

15 రోజుల క్రితం చింతలగొందిలో ఒకరు మృతి చెందారు. ఈ నెల ఆరో తేదీన ఏడాది పాప అనారోగ్యంతో మృతి చెందింది. ఈ రెండు నెలల వ్యవధిలో ఉర్లమెట్టలో మాతే గుండన్న, మాతే కొండబాబు, ఉల్లి బాలన్న అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు. ఈ వారంలో ఇదే గ్రామంలో మాతే మత్తయ్య (65), కొండపల్లి కంటమయ్యకు చెందిన నెలల వయస్సుగల బాబు, కె.బుచ్చయ్య (65), బి.భాగ్యవతి (30) మృతి చెందారు.

తాగునీటి కోసం ఉర్లమెట్టలో గ్రావిటీ పథకం ఉంది. అయితే దానికి ఫిల్టర్‌ బెడ్లను ఏర్పాటు చేయలేదు. కొండ నుంచి వచ్చే ఊట నీరు నేరుగా ట్యాంకుకు వెళ్లే విధంగా కనెక్షన్‌ ఇచ్చారు. ఇప్పుడు ఆ నీరు బురదగా వస్తుంది. ట్యాంకును కూడా క్లీనింగ్‌ చేయడం లేదు. తాగునీరు కలుషితం కావడం వల్లే జ్వరాలు విజృంభించినట్లు స్థానికులు చెబుతున్నారు. మలాథియాన్‌ పిచికారీ ఒకసారి చేసినా దోమలు తగ్గలేదని వారంటున్నారు.

సిహెచ్‌డబ్ల్యూతో సహా గిరిజనులు జ్వరాల బారిన పడినా అధికారులు పట్టించుకోలేదు. 12 కిలో మీటర్ల దూరంలో పిహెచ్‌సి ఉంది. అక్కడకు వెళ్లాలంటే నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్తే, అక్కడ నుంచి వాహన సౌకర్యం ఉంది. అంత దూరం నడిచి వెళ్లలేక గిరిజనులు ఆసుపత్రికి వెళ్లడం లేదు. ఎఎన్‌ఎం వచ్చి మందులు ఇచ్చినా జ్వరాలు అదుపులోకి రాలేదు. అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.

సిపిఎం నాయకులు సాగిన ధర్మానపడాల్‌, దీనబందు, రామారావు తదితరులు జ్వరాలతో బాధపడుతున్న ఉర్లమెట్ట గ్రామాన్ని సందర్శించారు. జ్వర పీడితులను పరామర్శించారు. తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

Related posts