telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జానపదంలో జ్ఞానపధంలో మేటి వింజమూరి అనసూయాదేవి ..

vinjamuri anasuyadevi memories
డాక్టర్ వింజమూరి అనసూయాదేవి రెండు రోజుల క్రితం  అమెరికా లోని వాషింగ్టన్ లో మృతి చెందారననే  వార్త  సంగీత ప్రియులను కలసివేసింది. ఈరోజు ఆమె అంత్యక్రియలు అమెరికాలో జరుగుతాయి. తెలుగునాట ప్రతి నోటా ప్రసిద్దులైనవారు వింజమూరి సిస్టర్స్.. సీతాదేవి, అనసూయాదేవి.
లలిత  సంగీతంలోనూ, జానపద సంగీతంలోనూ నూతన ఒరవడిని ప్రవేశపెట్టిన ఘనత వారిదే. ఒకప్పుడు ఆకాశవాణిలో సీతాదేవి, అనసూయాదేవి పాటలకు అత్యంత ప్రజాదరణ ఉండేది. అనంతరం సినిమాల్లో కూడా వీరు తమ ప్రతిభను చాటారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి  గారు రాసిన ఎన్నో పాటలను  వీరు గానం చేశారు. ఈ మేన కోడళ్లను  కృష్ణ శాస్త్రి గారు బాగా అభిమానించేవారు.
vinjamuri anasuyadevi memories
సీతాదేవి గారు 2016లో చనిపోయారు. ఇప్పుడు సీతాదేవి సోదరి అనసూయాదేవి 99 సంవత్సరాల వయసులో  ఇహలోక యాత్ర ముగించారు. అనసూయాదేవి మే 12 1920న పిఠాపురంలో జన్మించారు. చిన్నతనం నుంచే సోదరి సీతాదేవితో కలసి హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, శ్రీరంగం శ్రీనివాస రావు, గురజ్జాడ అప్పారావు, నండూరి మొదలైన వారి పాటలు గానం చేసేవారు. “జయ జయ ప్రియా భారతి జనని ” పాట  వీరికి ఎంతో పేరు సంపాదించి పెట్టింది. 
1979లో అనుకుంటాను బి.నరసింగరావు గారు  నిర్మాతగా, నటుడుగా గౌతమ్ ఘోష్ దర్శకత్వం వహించిన “మాభూమి “సినిమాకు వింజమూరి సీతాదేవి  సంగీత దర్శకత్వం వహించారు. ఆ సినిమా రికార్డింగ్ హైదరాబాద్  శ్రీసారధి స్టూడియోస్లో  జరిగింది. అప్పుడు సీతాదేవితో పాటు అనసూయాదేవిని కూడా వచ్చారు. వారితో జానపద సంగీతం గురించి మాట్లాడాను. 
vinjamuri anasuyadevi memories
ఆ తరువాత వంగూరి చిట్టెన్ రాజుగారి ఆహ్వానం అందుకొని 2014లో అమెరికా వెళ్ళాను. హ్యూస్టన్  నగరంలో అక్టోబర్ 25, 26 రెండు రోజులపాటు 9వ అమెరికా  తెలుగు సాహితి సదస్సు, మరియు ఉత్తర అమెరికా  తెలుగు కథ 50వ వార్షికోత్సవాలు  జరిగాయి. ఈ సదస్సులో ఆంధ్ర ప్రదేశ్ నుంచి రాజ్య సభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ గారు, అమెరికాలో ఇండియన్ కాన్సల్ జనరల్ పి.హరీష్ గారు, కళాప్రపూర్ణ  శ్రీమతి వింజమూరి అనసూయ దేవి గారు అధ్యక్షురాలుగా పాల్గొన్నారు. 
చాలాకాలం తరువాత ఆ అనసూయాదేవి గారిని చూడటం, వారి ఉపన్యాసం వినే అవకాశం  కలిగింది. అదే వేదిక మీద నాకు సత్కారం జరగడం నేను మర్చిపోలేని అనుభూతి. రెండు రోజుల తరువాత చిట్టెన్ రాజు గారు తన కారులో అనసూయాదేవి గారి ఇంటికి తీసుకెళ్లారు. కానీ వారు ఇంట్లో లేకపోవడంతో ఆమెను కలవలేకపోయాము. ఇప్పుడు అనసూయాదేవి చనిపోయారననే  వార్త తో స్మృతి పధంలో వారితో పరిచయం  మనసులో మెదిలింది. 
vinjamuri anasuyadevi memories
అనసూయాదేవి  దక్షిణ భారత దేశంలోనే మొదటి సంగీత దర్శకురాలు, ఆకాశవాణిలో మొదటి సంగీత దర్శకురాలు, శాస్త్రీయ, లలిత, జానపద గీతాలను స్వరపరచి పాడిన ఘనత ఆమెదే.  అనసూయాదేవి వ్రాసిన “భావగీతాలు”,  “జానపద గీతాలు” “అసమాన అనసూయ” బహుళ ప్రజాదరణ పొందాయి. ఆమె 11 పుస్తకాలు  వ్రాశారు. దేశంలోనూ విదేశాలలో అనేక పురస్కారాలు, సత్కారాలు పొందిన విదుషీమణి అనసూయాదేవి. అసమాన ప్రజ్ఞతో, అనన్య సామాన్యమైన పరిశోధనతో జానపద గీతాలను భావితరాలకు అందించిన ఘనత అనసూయాదేవిదే. బహుముఖ ప్రజ్ఞాశాలి అనసూయాదేవి మృతి  లలిత సంగీతానికి, జానపద సంగీతానికి తీరని లోటు. 
నవ్యమీడియా అనసూయాదేవి మృతికి నివాళులర్పిస్తుంది.
-భగీరథ

Related posts