telugu navyamedia
సామాజిక

వినాయ‌క చ‌వితి స్పెష‌ల్ ..

హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో వినాయక చవితి ఒకటి. అనేక ప్రాంతాలలో వినాయక చవితిని తరతరాలుగా జరుపుకుంటూనే వున్నారు. ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా.. ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలనుకుంటాం. అందుకోసం విఘ్నేశ్వరుడికి తొలిపూజ చేస్తాం. వినాయకుడిని పూజిస్తే తలపెట్టిన కార్యంలో ఏ ఆటంకాలు లేకుండా విజయం సాధించాలని వినాయకుడి పూజ చేస్తూ ఉంటారు.

ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వ‌చే్చ వినాయక చతుర్థినాడు దూర్వాలు, బిల్వాలతో, పువ్వులతో గణపతిని అర్చించి, 21 ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోతాయంటారు. నవరాత్రులూ కూడా వినాయకుడిని పూజించి ధూప నైవేద్యాలతో ప్రార్థిస్తారు. ఈ పూజలు 3 రోజులు, 5 రోజులు, 9 రోజులు, 14 రోజులు ఇలా ఎవరి తాహతు బట్టి వారు నిర్వహిస్తారు. అనంత చతుర్దశి నాడు గణేశుని సాగనంపుతూ ఉత్సవాన్ని జరుపుతారు. మచ్చి వచ్చే ఏడాది రావయ్య బొజ్జ గణపయ్య, గణపతి పప్పా మోరియా అంటూ భక్తులు నినదిస్తారు..

Vinayaka Chaturthi August 2021: Significance, Puja Vidhi and Shubh Muhurats  for Lord Ganesha Puja

వినాయక చవితి ముహూర్తం..
గణేశ చతుర్థిని భాద్రపద శుక్లపక్ష చవితి నాడు జరుపుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 10 శుక్రవారం నాడు రానుంది. చవితి తిథి ముందు రోజు 12.18 గంటల నుంచి సెప్టెంబరు 10 రాత్రి 09.58 గంటల వరకు ఉంటుంది. చవితి నాడు పూజ ఉదయం 11.03 గంటల నుంచి మధ్యాహ్నం 01.33 గంటల మధ్య జరుపుకోవాలి. ఈ రోజు విఘ్నేశ్వరుడిని పూజించడం వల్ల అడ్డంకులన్నీ తొలుగుతాయని, అనుకున్న కార్యంలో విజయం సాధిస్తారని భక్తులు విశ్వసిస్తారు.

విఘ్నేశ్వరుని కథ
సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు. పూర్వం గజ రూపం కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై ‘భక్తా! నీ కోరికేమి?’ అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి’ అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు. కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, ‘ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు.

ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడవలసింది’ అని వేడుకుంది. శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు. శ్రీహరి గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి, నందీశ్వరుని గంగిరెద్దుగా, బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి, గజాసురుని పురానికి వెల్లి సన్నాయి వాయిస్తూ, నందిని ఆడించారు. దానికి తన్మయుడైన గజాసురుడు ‘మీకేం కావాలో కోరుకోండి!’ అనగా, విష్ణుమూర్తి ‘ఇది మహమైన నందీశ్వరుడు. శివుని వెతుక్కుంటూ వచ్చింది. కాబట్టి నీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చెయ్యి’ అని అడిగాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు, సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు.
తనకిక మరణం తథ్యం అని గ్రహించి, శివునితో ‘నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి, నా చర్మం నీ వస్త్రంగా ధరించమని’ వేడుకొన్నాడు.అభయమిచ్చిన తరువాత, విష్ణుమూర్తి నందికి సైగ చేయగా, నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు. బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్తుతించాడు. అప్పుడు విష్ణుమూర్తి ‘ఇలా అపాత్ర దానం చేయకూడదు. దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది’ అని చెప్పి అంతర్థానమయ్యాడు.

Hello everyone... Wishing u all happy gouri Ganesh - SHEROES News - SHEROES  | SHEROES

గ‌ణప‌తి జననం
కైలాసంలో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదంగావించి లోపలికి వెళ్లాడు.
అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని, పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల ‘గజాననుడు’గా పేరు పొందాడు. అతని వాహనం అనింద్యుడనే ఎలుక. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమార స్వామి పుట్టాడు. అతని వాహనం నెమలి. అతను మహా బలశాలి.

వినాయక నిమజ్జనం
భాద్రపద శుద్ధ చవితి తరువాత వినాయకుడికి నవరాత్రి పూజలు చేసిన తరువాత, మట్టి వినాయకులను ఆడంబరంగా తీసుకొని వెళ్ళి దగ్గరలో ఉన్న నదిలో కాని సముద్రంలో కాని నిమజ్జనం చేస్తారు.

న‌వ్య మీడియా పాఠ‌కులకు వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు

Related posts