telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

మాల్యాను భారత్ కు అప్పగిస్తానన్న బ్రిటన్.. ఈ కల నెరవేరేనా..

vijaymalya to india will become a dream

వేలకోట్ల అప్పులు చేసి, చేతులు ఎత్తేసి బ్యాంకు రుణాలతో బాగా ఎంజాయ్ చేస్తున్న వారిలో మాల్యా ఒకడు. భారతదేశంలో బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా లండన్‌కు పరారైన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ అంగీకరించింది. భారత్ విచారణకు మాల్యాను అప్పగించాలని లండన్ కోర్టు తీర్పు చెప్పిన రెండు నెలలకు, బ్రిటన్ హోం మంత్రి సాజిద్ జావిద్ సోమవారం ఆమోదం తెలిపారు.

అయితే, మాల్యా భారతదేశం రావడానికి ఎంత సమయం పడుతుంది. మాల్యా 2016 మార్చిలో భారత్ నుంచి లండన్ వెళ్లిపోయారు. అప్పటి నుంచి భారత ప్రభుత్వం ఆయనను అప్పగించాలని కోరుతూనే ఉంది. కింది కోర్టు నిర్ణయంపై అప్పీలు చేస్తానని మాల్యా నిరుడు చెప్పారని నిక్ వామోస్ ప్రస్తావించారు. ఇప్పుడు అప్పీలు దాఖలుకు మాల్యాకు 14 రోజుల సమయం ఉందని, దీనిని మాల్యా న్యాయవాదులు సిద్ధం చేసే ఉంటారని భావిస్తున్నానని ఆయన చెప్పారు.

నిరుడు డిసెంబరు 10న వెస్ట్‌మినిస్టర్ కోర్టు తన నిర్ణయం ప్రకటించిన తర్వాత, దీనిపై అప్పీలు చేయాలనే ఉద్దేశాన్ని అప్పుడే వ్యక్తం చేశానని మాల్యా తాజాగా ట్విటర్‌లో చెప్పారు. ఇప్పుడు హోం మంత్రి నిర్ణయం నేపథ్యంలో అప్పీలు ప్రక్రియను చేపడతానని తెలిపారు.

”మాల్యా అప్పీలును హైకోర్టు విచారణకు స్వీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే వాస్తవాల నిర్ధరణకు, న్యాయ వ్యవహారాలకు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలు ఈ కేసులో ఉన్నాయి. అప్పీలుపై విచారణకు రెండు మూడు నెలలు పడుతుంది. హైకోర్టు పునర్విచారణ జరపదు. కింది కోర్టు ఇచ్చిన తీర్పు సరైనదేనా, కాదా అన్నది నిర్ణయిస్తుంది” అని నిక్ వామోస్ వివరించారు.

”మాల్యా అప్పీలు స్వీకరణకు పైకోర్టు అంగీకరించి విచారణ చేపడితే అది ముగియడానికి నెలల సమయం పట్టొచ్చు. ఎందుకంటే అప్పీళ్ల కోర్టులో చాలా కేసులు ఉంటాయి. మొత్తం ప్రక్రియ పూర్తవడానికి ఐదు లేదా ఆరు నెలల వరకు పట్టొచ్చు. ఈ కోర్టులోనూ మాల్యాకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే, ఆయన సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియకు మరో ఆరు వారాలు పడుతుంది. దరఖాస్తుపై విచారణ చేపడితే ఆ ప్రక్రియ పూర్తికావడానికి నెలలు పడుతుంది. సంవత్సరం కూడా పట్టొచ్చు. అప్పీలు ప్రక్రియ త్వరితగతిన చేపట్టాలని కోరుతూ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) దరఖాస్తు చేయొచ్చు. తక్కువ సందర్భాల్లోనే కోర్టు అందుకు అంగీకరిస్తుంటుంది. సత్వర విచారణ ఎందుకు అవసరమనేదానిపై కోర్టును ఒప్పిస్తేనే ఇది సాధ్యమవుతుంది” అని సరోష్ జైవాలా చెప్పారు.

అప్పీళ్ల కోర్టు అప్పీలును విచారణకు స్వీకరించి, కింది కోర్టు తీర్పును కొట్టివేయడం అరుదేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదంతా అప్పీలుకు మాల్యా చెప్పే ప్రాతిపదికను కోర్టు పరిగణనలోకి తీసుకొంటుందా, లేదా అనేదానిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. మాల్యాను భారత్‌కు రప్పించే దిశగా మోదీ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తే, ప్రతిపక్షాలు శారదా కుంభకోణం నిందితులకు వత్తాసు పలుకుతున్నాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.

తనపై ఉన్న పరారీ ముద్రను తొలగించుకునేందుకు విజయ్ మాల్యా నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకుల అప్పు తీరుస్తానన్న తన ఆఫర్లకు భారత అధికార వర్గాలను ఒప్పించడానికి విశ్వప్రయత్నాలు చేసిన మాల్యా, సుప్రీంకోర్టును ఆశ్రయించి తన పేరుకు ముందు పరారీ ముద్రను తీసేయాలని, విచారణపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, దర్యాప్తు సంస్థల అభియోగపత్రాల ఆధారంగా ఈడీ ఆయనను పరారీలో ఉన్న ఎగవేతదారుగా నిర్ధరించింది.

తనను భారత్‌కు అప్పగిస్తే అక్కడి జైళ్లలో సరైన వసతులు ఉండవంటూ కూడా మాల్యా గతంలో కోర్టులో వాదించారు. ఒకవేళ ఆయనను భారత్‌కు అప్పగిస్తే, విచారణ సమయంలో ఆయన్ను ఏ జైల్లో పెడతారో, అక్కడ ఎలాంటి వసతులు ఉన్నాయో తెలిపేలా ఒక వీడియోను తీసి పంపాలని కేసు విచారణ సందర్భంగా బ్రిటన్ కోర్టు ఆదేశించింది.

Related posts