telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పోలీసులతో విజయ్ దేవరకొండ వీడియో కాన్ఫరెన్స్

vijay

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 21 రోజుల లాక్‌డౌన్ పూర్తయింది. మే 3 వరకు ఈ లాక్‌డౌన్‌ను పొడిగించారు. అయితే, ఈ లాక్‌డౌన్ కఠినంగా అమలుచేయడానికి ప్రజలు అనవసరంగా రోడ్లపై తిరగకుండా చూసుకోవడానికి పోలీసు శాఖ చాలా కష్టపడుతోంది. ఈ లాక్‌డౌన్ ఎంతో ముఖ్యమో తెలిసి కూడా చాలా మంది అనవసరంగా రోడ్ల మీదికి వస్తున్నారు. ఇలాంటి వారిని అడ్డుకోవడం కోసం, లాక్‌డౌన్‌ను పకడ్బంధీగా అమలు చేయడం కోసం హైదరాబాద్ పోలీసులు రాత్రింబవళ్లు రోడ్లపై విధులు నిర్వహిస్తున్నారు.పోలీసుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనిలో భాగంగా సోమవారం హీరో విజయ్ దేవరకొండతో హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధుల్లో ఉన్న పోలీసులతో మాట్లాడించారు.

పోలీసులను ఉత్తేజపరిచేలా విజయ్ దేవరకొండ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పోలీస్ అన్నలందరికీ నమస్కారం’’ అంటూ రెండు చేతులు పైకెత్తి విజయ్ నమస్తే చెప్పారు. ‘‘అందరూ బాగున్నారా? బాగుంటే థంబ్స్ అప్ చూపించండి అంటూ ఉత్తేజపరిచారు. ఇలాంటి రోజు వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేను కమీషనర్ ఆఫీసుకు వస్తుంటే ప్రతి షాప్ మూసి ఉంది, రోడ్లు ఖాళీ, ఒకే ఒక్క బ్యాచ్ కనిపిస్తోంది. వాళ్లెవరంటే.. మన పోలీసు వాళ్లు. సిటీ అంతా షట్‌డౌన్ ఉన్నా ప్రతి కిలోమీటర్‌కు బారికేడ్లు, పోలీసు వారు కనిపిస్తున్నారు. మా అమ్మ వంటచేసి, గిన్నెలు తోమి, మా బట్టలు ఉతికేసరికే చాలా అలసిపోతోంది. కానీ, మీరో రోజూ వచ్చి రిపోర్టు చేసి, మళ్లీ వెళ్లి ఇంటి పనులు చూసుకోవడం మామూలు విషయం కాదు. ఈ లాక్‌డౌన్ అయిపోయేంత వరకు పోలీస్ శాఖకు నా పూర్తి సహకారం ఉంటుంది. కమీషనర్ గారు ఎప్పుడు నన్ను పిలిచినా, నా నుంచి ఏమైనా చెప్పమని అడిగినా 100 శాతం నేను అందుబాటులో ఉంటాను. అని విజయ్ అన్నారు.

Related posts