telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా” స్పెషల్ షో… వీక్షించిన ఉపరాష్ట్రపతి, చిరు

Chiranjeevi

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా విడుదల చేశారు. అయితే త‌న సినిమాని విస్తృతంగా ప్ర‌మోట్ చేసుకుంటున్న చిరు రీసెంట్‌గా ఏపీ సీఎం జ‌గ‌న్‌ని క‌లిసి సైరా సినిమా చూడాల‌ని కోరారు. ఇక బుధ‌వారం ఢిల్లీ వెళ్లిన చిరు ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడిని క‌లిసి ఆయ‌న ఇంట్లో సైరా స్పెష‌ల్ షో ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఆయ‌న‌తో క‌లిసి సినిమాని చూసారు చిరు. ఈ సందర్భంగా “బ్రిటిష్ వారి అరాచకాలను ఎదిరిస్తూ.. స్వాతంత్ర సమరయోధుడు శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటస్ఫూర్తితో.. రూపొందించిన ‘సైరా’ చిత్రం బాగుంది. నటులు శ్రీ చిరంజీవి, శ్రీ అమితాబ్ బచ్చన్, దర్శకుడు శ్రీ సురేందర్ రెడ్డికి అభినందనలు. నిర్మాత శ్రీ రామ్ చరణ్ తేజ్ కు ప్రత్యేక అభినందనలు. ఊరువాడ చూడదగిన ఉత్తమ చిత్రం ‘సైరా’. చాలా కాలం తర్వాత చక్కని, ప్రేరణా దాయకమైన చిత్రం చూసే అవకాశం లభించింది. వలస పాలకుల దుర్మార్గాలను చాలా చక్కగా చిత్రీకరించారు. నిర్మాత, నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు అందరికీ అభినందనలు” అని వెంక‌య్య నాయుడు త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

Related posts