telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉత్తరప్రదేశ్ : .. యోగి చేతులమీదుగా .. తొలి ప్రైవేట్ రైలు .. ప్రారంభం..

UP CM started first private train

దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ‘తేజస్ ఎక్స్‌ప్రెస్’ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ రైలు రైల్వే శాఖకు సంబంధించిన ఐఆర్‌సీటీసీ పర్యవేక్షణలో పనిచేస్తుంది. లక్నో-న్యూఢిల్లీ మార్గంలో ప్రయాణికులను చేరవేస్తుంది తేజ్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఈ రైలు కారణంగా లక్నో-న్యూఢిల్లీ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న వేగవంతమైన స్వర్ణ శతాబ్ది రైలు 6.40 గంటల్లో లక్నో నుంచి న్యూఢిల్లీకి చేరుకుంటే.. ఈ తేజస్ 6.15 గంటల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ఈ రైలుకు కాన్పూర్, ఘజియాబాద్‌లలో మాత్రమే ఈ రైలు ఆగుతుంది. మంగళవారం మినహా ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుంది.

శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కేటగిరీకి చెందిన తేజ్ ఎక్స్‌ప్రెస్‌లో అత్యాధునిక వసతులున్నాయి. ఈ రైలులో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంటల చొప్పున పరిహారం చెల్లించడం జరుగుతుంది. ఇందులో ప్రయాణించే ప్రయాణికులకు రూ. 25లక్షల ఉచిత బీమా సౌకర్యం కూడా ఉంది. ఈ రైలులో ప్రయాణికులకు సౌకర్యవంతమైన వసతులున్నాయి. తేజస్ ఎక్స్‌ప్రెస్ చైర్ కారుకు రూ. 1280, ఎగ్జిక్యూటివ్ చైర్ కారుకు రూ. 2450గా ధరను నిర్ణయించారు. ఈ రైలు విజయవంతమైతే దేశ వ్యాప్తంగా ఇలాంటివి ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా లాంటి 50 ప్రధాన మార్గాల్లో ప్రైవేటు రైళ్ల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని రైల్వే బోర్డు ఇప్పటికే జోనల్ రైల్వే విభాగాలకు సూచనలు చేసింది.

తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు లాంటి రైళ్లు దేశ వ్యాప్తంగా ఇతర నగరాలకు కూడా విస్తారించాలని యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. తొలి ప్రైవేటు రైళ్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోనే తొలి కార్పొరేట్ రైలును ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి నడిపేందుకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోడీకి, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు యోగి ఆదిత్యనాథ్ ధన్యవాదాలు తెలిపారు. భారత రైల్వే శాఖ చౌక ధరల్లోనే భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. ఆగ్రా-వారణాసి మధ్య సెమీ బుల్లెట్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ అంగీకరిస్తే భూసేకరణకు అయ్యే వ్యయాన్ని తామే భరిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే లక్నో-అలహాబాద్, లక్నో-గోరఖ్‌పూర్ మధ్య హైస్పీడ్ రైళ్లు నడపాలని ఈ సందర్భంగా కేంద్రానికి, రైల్వే శాఖకు ఆయన విజ్ఞప్తి చేశారు. నేటి ఆధునిక ప్రపంచంలో పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థ అవసరమని యోగి అన్నారు.

Related posts