telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఏకాదశి ప్రాముఖ్యత.. వ్రత విధానం..

types of yekadasi and vaikunta vratam

హిందూ ధర్మలో ఏకాదశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అది వైకుంఠ ఏకాదశి అంటే ఇంకా చాలా గొప్పగా పాటిస్తారు. ఆనాటి విశేషాలు చూడదగ్గవే కానీ చెప్పగలిగేవి కావు. అంతటి ప్రాధాన్యత ఉన్నది కాబట్టే, ఆ రోజు వ్రత ఆచరణ కూడా చెప్పబడింది. నిష్ఠగా పాటిస్తే, కోటి రేట్ల ఫలం. ప్రతి ఏకాదశీ పురాణ గాథతో ముడివడి ఉంది. హరినామ సంకీర్తనలకు ఆలవాలం కావడంతో, ఏకాదశిని ‘హరి వాసరం’గా వ్యవహరిస్తారు. ప్రతి హరి వాసరానికీ ఒక్కో ప్రత్యేక వ్యవహార నామం ఉంది. ఆషాఢ శుద్ధ ఏకాదశికి ‘ప్రథమ ఏకాదశి’ అని పేరు. దానికే ‘శయన ఏకాదశి’ అనే మరో పేరు పురాణ గాథ అనుసరించి ఏర్పడింది. ఆషాఢ బహుళ ఏకాదశి- కామిక ఏకాదశి. శ్రావణ మాసంలో మొదటిది పుత్ర ఏకాదశి (లలిత ఏకాదశి అంటారు). రెండోది, అజ ఏకాదశి లేదా ధర్మప్రభ ఏకాదశి. ధనుర్మాసంలో మకర సంక్రమణానికి ముందుగా వచ్చే ఏకాదశి- వైకుంఠ ఏకాదశి. దీన్ని ముక్కోటి, మోక్షద ఏకాదశి, సఖ్యద ఏకాదశి అని పిలుస్తారు. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం మోక్ష ద్వారమని ప్రతీతి. అది ఆ ఒక్క రోజే తెరుచుకుంటుంది. దాన్ని ‘వైకుంఠ ద్వారం’ అంటారు. తిరుమలలో వైకుంఠద్వార ప్రవేశానికి భక్తులు ఉవ్విళ్లూరుతారు. వైకుంఠ ద్వారాలు తెరుచుకునే ఏకాదశి కనుక, దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న ప్రసిద్ధి ఏర్పడింది.

ఏకాదశి రోజున వేయి కనులతో వీక్షించి, సేవించి, తరి౦చాలని పండితులు చెబుతున్నారు. ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం. శ్రీమహావిష్ణువుతో పాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరూపమైనది. ఈ వైకుంఠ ఏకాదశినే ‘పుత్రద ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు.

ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళక ముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశి నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ఆ రోజున భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి రోజున లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి నైవేద్యంగా పాయసం పెట్టాలని పండితులు అంటున్నారు. ఏకాదశి రోజున స్వామివారికి ప్రీతికరమైన ‘పాయసం’తో పాటు వివిధరకాల తీపిపదార్థాలను ఆయనకి నైవేద్యంగా సమర్పించడం ఉత్తమం. అలాగే జాజిమాలను విష్ణుమూర్తి పటానికి వేసి, పాయసం, తీపి పదార్థాలు, ఆకుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్తుతించడం శుభప్రదమని పండితులు అంటున్నారు.

Related posts