telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్

టీటీడీ భూములు అమ్మకంపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన

YV-Subbareddy

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భూముల వేలంపాటపై టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. తమకు నిందలు కొత్తేమీ కాదని, తిరుమల కొండకు తాము సేవకులుగా వెళ్లామని స్పష్టం చేశారు. తమపై ఎలాంటి నిందలు వేసినా తట్టుకునే శక్తి తకుందని తేల్చి చెప్పారు. తిరుమల వెంకన్నకు రాజకీయాలు ఆపాదించొద్దని హితవు పలికారు. టీటీడీ భూముల వివాదంపై సోమవారం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అన్యాక్రాంతం అయ్యే అవకాశం ఉన్న టీటీడీ భూములను విక్రయించుకోవచ్చని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో అన్యాక్రంతం అయ్యే అవకాశం ఉన్న భూములు గుర్తించామని, వీటిని విక్రయించడానికి గల అవకాశాలు పరిశీలించాలని గత బోర్డు సమావేశంలో చర్చించినట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. టీటీడీ ఆస్తులు విక్రయిస్తున్నామని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. దీనిపై చర్చించామే గాని.. భూముల విక్రయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. స్వామివారికి భక్తులు ఇచ్చిన భూములను కాపాడాలనేదే తమ తాపత్రయమని చెప్పారు. తమకు దోచుకోవాలన్న ఆలోచన ఉంటే.. టీటీడీ భూములనే అమ్మాల్సిన అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం మానుకోవాలని హితవు పలికారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు సదావర్తి భూములు, కనకదుర్గమ్మ భూములు కొట్టేయాలని చూశారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ నిధులను కాపాడే ప్రయత్నం చేశామని సుబ్బారెడ్డి తెలిపారు. చంద్రబాబు హయాంలో అప్పనంగా భూములు ఇచ్చారన్నారు. అయినా టీటీడీలో నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మడం కొత్తకాదని చెప్పారు. టీటీడీ ఆస్తులను కాపాడటంలో భాగంగానే సమీక్షలు జరిపామని సుబ్బారెడ్డి తెలిపారు.

Related posts