telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దసరాకు.. ఆర్టీసీ సెగ.. ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవా..

Tsrtc increase salaries double duty employees

ఆర్టీసీ సమ్మె పండగకు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న నగరవాసులకు సమస్యగా పరిణమించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే అక్టోబర్‌ 5 ఉదయం నుంచి సమ్మెలోకి వెళ్తామని టీఎ్‌సఆర్టీసీ జేఏసీ తేల్చిచెప్పింది. ప్రభుత్వం బుధవారం ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన కమిటీతో జేఏసీ నాయకులు జరిపిన చర్చలు ఫలించకపోవడంతో గురువారం రాత్రి మరోసారి చర్చలు జరుపుతున్నారు. ఒక వేళ చర్చలు విఫలమై కార్మికులు సమ్మెలోకి వెళ్లినా.. దసరాకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలపై ఆర్టీసీ దృష్టిసారించింది. ఆర్టీసీ ఉద్యోగులు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

శనివారం నుంచి ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనున్నందున అవసరమయితే అదనపు సిబ్బందిని నియమిస్తూ జిల్లాలకు ప్రయాణికులు వెళ్లే ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. ఇప్పటికే ఊర్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీతో టీఎస్‌ ఆర్టీసీ జేఏసీ నాయకులు గురువారం రాత్రి 10 గంటల వరకూ చర్చలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ లభిస్తే ఆర్టీసీ జేఏసీ నాయకులు సమ్మె విరమించుకునే అవకాశాలున్నాయి. అవసరమయితే శుక్రవారం మరోసారి ఆర్టీసీ జేఏసీ నాయకులతో అధికారులు చర్చలు జరిపే అవకాశాలున్నాయి.

Related posts