telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో తెలంగాణ కేబినెట్‌ సమావేశం కొనసాగుతోంది. తెలంగాణలోని అనాథలు, శరణాలయాల స్థితిగతులు, సమస్యలు అవగాహన విధాన రూపకల్పన కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటుకానుంది. సభ్యులుగా మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని, కొప్పుల ఈశ్వర్‌, గంగుల, ఇంద్రకరణ్‌రెడ్డి.. మంత్రివర్గ ఉపసంఘం సభ్యులుగా జగదీష్‌రెడ్డి, ఎర్రబెల్లి, కేటీఆర్‌ ఉంటారు. రాష్ట్రంలో కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శికి కేబినెట్‌ ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని ఆదేశించింది.

వ్యవసాయ అంశాలపై తెలంగాణ కేబినెట్‌ సమావేశంలో చర్చ జరిగింది. వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు అంశాలపై కేబినెట్‌ చర్చించింది. ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు రూ.50 వేల వరకు పంటరుణాల మాఫీకి కేబినెట్‌ ఆదేశించింది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈబీసీ రేజర్వేషన్‌ కోటాకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రూ.8 లక్షల్లోపు ఆదాయం ఉన్న ఈబీసీ అభ్యర్థులు అర్హులుగా కేబినెట్‌ తీర్మానించింది. ఈబీసీ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది.

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై కేబినెట్‌ సమావేశంలో చర్చ జరిగింది. వ్యాక్సినేషన్‌, ఆస్పత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపై మంత్రి వర్గం చర్చించింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కరోనా తగ్గకపోవడంతో మందులు, బెడ్స్‌ అందుబాటులో ఉంచడంపై కేబినెట్‌ చర్చ జరిపింది. అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని కేబినెట్‌ ఆదేశించింది. నూతనంగా మంజూరైన 7 నూతన మెడికల్‌ కాలేజీలను వచ్చే ఏడాది నుంచి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌ చర్చించింది.

Related posts