• Home
  • Uncategorized
  • ఏవోబీలో ఉద్రిక్త వాతావరణం‌..లివిటిపుట్టులో యువకులు మాయం?
Uncategorized క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

ఏవోబీలో ఉద్రిక్త వాతావరణం‌..లివిటిపుట్టులో యువకులు మాయం?

ప్రభుత్వ విప్, అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యానంతరం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌తో గిరిజన ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు గిరిజనులను విచారిస్తున్నారు. ఎప్పుడు ఏం జరగుతుందోనన్న భయంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు.

హత్యానంతరం జరిగిన పరిణామాలను పోలీసులు నిశితంగా గమనిస్తున్నారు. హత్యకు ముందు మావోయిస్టులు ఎలా వ్యవహరించారో ఒక్కొక్కటిగా పోలీసుల విచారణలో వెలుగుచూస్తున్నాయి. దాడికి సమీప గ్రామాల్లోని యువకులు సహకరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టులతోపాటు స్థానిక యువతీ, యువకులు ఎవరైనా అజ్ఞాతంలోకి వెళ్లారా? అనే కోణంలో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నారు.

కిడారి, సోమల హత్యానంతరం అత్యంత దట్టమైన అటవీ ప్రాంతాల్లోని గ్రామాలకు చెందిన ఐదారుగురు యువకులు అదృశ్యమైనట్టు తెలుస్తోంది. అయితే వారి గురించి ఇంకా స్పష్టమైన వివరాలు మాత్రం తెలియరాలేదు. వీరు గతంలో మావోయిస్టుల ఉద్యమంలో పాల్గొని ఉంటారని భావిస్తున్నారు. ఈ దాడిలో పాల్గొన్న మావోయిస్టులలో చాలా మంది 25 ఏళ్లలోపు వారేనని సాక్షుల చెబుతున్నారు. వారిలో కొందరి చేతిలో ఆయుధాలు కూడా లేవని ప్రత్యక్ష సాక్షులు ఇప్పటికే పోలీసులకు తెలియజేశారు. లివిటిపుట్టు ఘటన అనంతరం మన్యంలోని గ్రామాల్లో ఎవరెవరు ఆచూకీ లేదు? వారికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

మరోవైపు ఈ ఘటనలో పాల్గొన్న మహిళా మావోయిస్టు కామేశ్వరి అలియాస్‌ స్వరూప స్వస్థలం భీమవరమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో నరసాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో నరసాపురం డివిజన్‌ పరిధిలోని 25 మంది సీఐలు, ఎస్సైలు, 150 మంది పోలీసులు ఏకకాలంలో తనిఖీల్లో పాల్గొన్నారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆమె ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేసినట్టు అనుమానించి పోలీసులు మంగళవారం భీమవరం పరిధిలోని డిపోల్లో తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో సమీప ప్రాంతాల గిరిజనులు వణికి పోతున్నారు. ఎప్పుడేమి జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు. 

Related posts

కాంగ్రెస్ యువ నేత దారుణ హత్య…కూటమిలో విభేదాలకు సాక్ష్యమా…

chandra sekkhar

ఛత్తీస్గడ్ లో ఎన్ కౌంటర్…నలుగురు నక్సల్స్ మృతి…

chandra sekkhar

నిరంతర విద్యుత్‌తోనే ప్రజలకు మేలు: ఉపరాష్ట్రపతి వెంకయ్య

madhu

Leave a Comment