telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ కు భారత్ vs చైనా సెగ… వివోను వదులుకోమన్న బీసీసీఐ

IPL

భారత్, చైనా సైనికుల మధ్య గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణతో దేశం మొత్తం అట్టుడుకుతోంది. భారత సైనికుల్ని కవ్వించి దొంగ దెబ్బ తీసిన చైనా తీరుని నిరసిస్తూ.. ఆ దేశ ఉత్పత్తుల్ని బహిష్కరించాలని అందరూ పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న.. చైనాకి చెందిన వివోతోనూ సంబంధాల్ని తెంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొందరు సూచనలు చేస్తున్నారు. కానీ.. వివోతో బీసీసీఐ ఆ తెగదెంపులకి సిద్ధంగా లేదని బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ తాజాగా స్పష్టం చేశాడు. బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. ఏటా రూ. 440 కోట్లు చెల్లిస్తోంది. ఈ అగ్రిమెంట్ 2022లో ముగియనుండగా.. ఇప్పుడు రద్దు చేసుకుంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని బీసీసీఐ భావిస్తోంది. కావాలంటే 2022 తర్వాత స్పాన్సర్‌షిప్‌పై రివ్యూ చేస్తామని తాజాగా చెప్పుకొచ్చిన అరుణ్ ధుమాల్.. ప్రస్తుతానికి ఆ అగ్రిమెంట్‌ని రద్దు చేసుకునే సూచనలు లేవని తేల్చిచెప్పేశాడు. వివో నుంచి ప్రచారం రూపంలో బీసీసీఐకి వస్తున్న ఆదాయంలో 42 శాతం టాక్స్‌ని భారత ప్రభుత్వానికి బీసీసీఐ చెల్లిస్తున్నట్లు కూడా అరుణ్ ధుమాల్ స్పష్టం చేశాడు. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే బీసీసీఐ గత మార్చి నుంచి వందల కోట్లు నష్టపోయింది. ఒకవేళ ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ కూడా రద్దయితే సుమారు రూ.4000 కోట్లు బీసీసీఐకి చేజారనున్నాయి. ఈ నేపథ్యంలో.. సాహసోపేత నిర్ణయాలు తీసుకునేందుకు బీసీసీఐ వెనకడుగు వేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లను నిర్వహించాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ సమయంలో టైటిల్ స్పాన్సర్ మార్పు శ్రేయస్కరంకాదని బీసీసీఐ భావిస్తోంది.

Related posts