telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ సినిమా వార్తలు

నటుడు రాళ్ళపల్లి .. మృతి.. ప్రముఖుల నివాళులు ..

tollywood condolence to actor rallapalli

తెలుగు సినీపరిశ్రమలో తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించిన నటుడు రాళ్లపల్లి వెంకట నర్సింహారావు మృతి చెందారు. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఆయన గత కొంతకాలంగా బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మోతీ నగర్‌లోని ఆయన నివాసం నుంచి కుటుంబ సభ్యులు మ్యాక్స్‌ క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాళ్లపల్లి తుదిశ్వాస విడిచారు.

1979లో ‘ కుక్కకాటుకు చెప్పుదెబ్బ’తో సినీ రంగ ప్రవేశం చేసిన రాళ్లపల్లి… శుభలేఖ, ఖైదీ, ఆలయశిఖరం, మంత్రిగారి వియ్యంకుడు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, సితార, ఆలాపన, న్యాయానికి సంకెళ్లు, ఏప్రిల్‌ 1 విడుదల, సూర్య, ఐపీఎస్‌, దొంగపోలీసు, కన్నయ్య కిట్టయ్య తదితర 850కి పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు 3 దశాబ్దాలకుపైగా సినీ పరిశ్రమకు ఆయన విశేష సేవలందించారు. రాళ్లపల్లి తూర్పుగోదావరి జిల్లా రాచపల్లిలో 1945 ఆగష్టు 15న జన్మించారు. విద్యార్థి దశ నుంచే ఆయనకు నాటకాల పట్ల మక్కువ ఎక్కువ.

రాళ్లపల్లి మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. నాటక, చలనచిత్ర రంగాల్లో రాళ్లపల్లిది ప్రత్యేక స్థానమని, తనదైన శైలిలో సునిశిత హాస్యంతో గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో రాళ్లపల్లి చెరగని ముద్ర వేశారని చంద్రబాబు అన్నారు.

tollywood condolence to actor rallapalliరాళ్లపల్లి మృతికి చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నై వాణీమహల్లో నాటకాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్లపల్లిని కలిశానని చిరంజీవి వెల్లడించారు. రాళ్లపల్లి నటన సహజంగా ఉంటుందని, అందుకే ఆయన నటన అంటే ఎంతో అభిమానం అని తెలిపారు. రాళ్లపల్లి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో రాళ్లపల్లి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు.

రాళ్లపల్లి మృతి పట్ల వైసీపీ అధినేత జగన్ స్పందించారు. రాళ్లపల్లి కన్నుమూసిన విషయం తెలిసి జగన్ ఎంతో విచారానికి లోనయ్యారంటూ వైసీపీ తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. రాళ్లపల్లి కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఓ నటుడిగానే కాకుండా దర్శకరచయితగా అటు నాటక రంగంలోనూ, ఇటు సినిమా రంగంలోనూ అనితరసాధ్యమైన రీతిలో ఎన్నో ఘనతలు సాధించారని వైసీపీ రాళ్లపల్లిని కీర్తించింది.

Related posts