telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

తిరుమల : .. అందరికి శ్రీవారి ప్రసాదాలు .. పెద్దలడ్డు, వడలు…

tirumala big laddu and vada to all

శ్రీవారి ప్రసాదాల్లో అత్యంత ప్రాధాన్యమున్న లడ్డూల్లో రెండు రకాలున్నాయి. ఇందులో చిన్న లడ్డూలను భక్తులందరికీ విక్రయిస్తారు. పెద్దలడ్డూలు, వడలు మాత్రం టీటీడీ అధికారుల సిపారసు లేఖలపై కొందరికే లభిస్తాయి. పైగా వాటిని ఆలయం లోపల వగపడి వద్దే తీసుకోవలసి ఉంటుంది. ఈ విధానంలో కొన్ని మార్పు లు చేసి పెద్ద లడ్డూ, వడల విక్రయాలను ఆలయం వెలుపలికి మార్చాలని, వాటి తయారీ సంఖ్య పెంచి సాధారణ భక్తులకు సైతం కొన్ని అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయం త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ప్రస్తుతం ఆలయం లోపల ప్రసాదాల వితరణ ప్రదేశానికి తూర్పు వైపున ఉన్న వగపడి అరలో పెద్దలడ్డూలు, వడలు విక్రయిస్తున్నారు. అధికారుల సంతకంతో సిఫారసు లేఖలు పొందినవారు ఆలయంలోకి వెళ్లే టీటీడీ ఉద్యోగిని బతిమాలి లేఖను వగపడికి పంపి లడ్డూలు, వడలు పొందాల్సి ఉంటుంది.

టీటీడీ ఉద్యోగులకు ఇది పెద్ద సమస్య కాకపోయినా, ఇతరులు వాటిని పొందేందుకు నానా అవస్థలు పడుతుంటారు. దీనిపై సమాలోచనలు జరిపిన అదనపు ఈవో ధర్మారెడ్డి ఆలయం వెలుపల లడ్డూ కౌంటర్‌లోనే పెద్ద లడ్డూలు, వడలు కూడా విక్రయించాలని ఆదేశించారు. ఆలయం లోపల తయారైన వీటిని కన్వేయర్‌ బెల్టు ద్వారా వెలుపలకు తరలించి సేల్స్‌ కౌంటర్‌కు పంపుతారు. అక్కడ సిఫారసు లేఖలు ఉన్న భక్తులతో పాటు సిఫారసులు లేని వారికి కూడా కొన్ని అందుబాటులో ఉంచుతారు. రద్దీకి అనుగుణంగా తయారీ సంఖ్యను నిర్ధారించి విక్రయిస్తారు. మరోవైపు కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్థులకు ప్రస్తుతం పెద్ద లడ్డూ, వడ ప్రసాదాలను అయినమహల్‌ మండపంలో అందజేస్తున్నారు. దాంతో అక్కడ రద్దీ ఏర్పడి ఇబ్బందులు తలెత్తుతున్నందున ఆ పంపిణీని కూడా ఆలయం వెలుపల కౌంటర్‌కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు.

Related posts