telugu navyamedia
వార్తలు సామాజిక

“ఉదయాన్నే ఇలా చేస్తున్నారా..? అయితే బరువు తగ్గడం కష్టమే” !

బరువు తగ్గి నాజూగ్గా మారాలని ఎవరికి ఉండదు చెప్పండి. దానికోసమే నానా ప్రయత్నాలూ చేస్తుంటారు చాలామంది. తీసుకునే ఆహారం, చేసే వ్యాయామం విషయాల్లో పకడ్బందీగా ప్రణాళిక వేసుకుంటారు. అయితే అన్నీ ప్లాన్‌ ప్రకారమే ఫాలో అవుతున్నప్పటికీ కొందరు ఎంతకీ బరువు తగ్గరు. ఇందుకు కారణమేంటో అర్థం కాక తలలు పట్టుకుంటుంటారు. అయితే మన అధిక బరువును తగ్గించుకునే విషయంలో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మనకుండే కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే బరువు తగ్గే విషయంలో ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.

ముఖ్యంగా మనం ఉదయాన్నే చేసే కొన్ని పొరపాట్ల వల్ల బరువు తగ్గకపోగా, అవి మన ఆరోగ్యానికి కూడా కీడు చేస్తాయంటున్నారు వారు. ఇంతకీ బరువు తగ్గాలన్న మన ఆశయాన్ని ఆవిరి చేసే ఆ ఉదయపు అలవాట్లు, ఇతర పొరపాట్లేంటో తెలుసుకుందాం రండి..

“కాఫీ/టీలతో రోజు ప్రారంభిస్తున్నారా”?

చాలామందికి ఉదయం నిద్ర లేచీ లేవగానే కప్పు కాఫీ లేదా టీ కడుపులో పడందే రోజు ప్రారంభం కాదు. అయితే ఇవి సహజసిద్ధమైన మూత్ర విసర్జన కారకాలుగా పనిచేస్తాయి. ఉదయాన్నే వీటిని తాగడం వల్ల మన శరీరంలో ఎక్కువ మొత్తంలో నీరు మూత్రం ద్వారా బయటికి వెళ్లిపోయి డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. తద్వారా మన శరీరంలోని జీవక్రియల పనితీరు మందగించి బరువు తగ్గడానికి బదులుగా పెరిగే అవకాశమే ఎక్కువ. కాబట్టి ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా నిమ్మరసం పిండిన గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగడం శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. ఈ మిశ్రమం జీవక్రియల పనితీరును వేగవంతం చేయడంతో పాటు శరీరంలోని విషపదార్థాలను బయటికి పంపిస్తుంది. ఈ అలవాటు అటు బరువు తగ్గడానికే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మంచిది.

“కార్బోహైడ్రేట్లు వద్దు.. ప్రొటీన్లు ముద్దు”!

అల్పాహారం అనగానే చాలామందికి గుర్తొచ్చేది బ్రెడ్‌-ఛీజ్‌ లేదా బ్రెడ్డు-జామ్‌. దీన్ని తయారుచేసుకోవడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదనో, రుచిగా ఉంటుందనే ఉద్దేశంతో బ్రెడ్‌ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునే వారు మనలో చాలామందే. అయితే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఇలాంటి అల్పహారాన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలగదని చెబుతున్నారు నిపుణులు. తద్వారా చక్కెరలు, ఇతర స్నాక్స్‌ తీసుకోవాలన్న కోరిక అధికమవుతుందని.. ఇది క్రమంగా బరువు పెరగడానికి దోహదం చేస్తుందంటున్నారు వారు. కాబట్టి కార్బోహైడ్రేట్లుండే ఆహారానికి బదులుగా ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, పాలు, నట్స్‌, పండ్ల స్మూతీలు, ఓట్స్‌.. వంటివి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో సంతృప్త హార్మోన్ల స్థాయులు పెరుగుతాయి. ఫలితంగా ఆకలి తగ్గి ఏది పడితే అది తినాలన్న కోరిక అదుపులో ఉంటుంది. బరువు తగ్గడానికి ఇదీ ఓ మార్గమే.

“అది ‘బరువు’కు ప్రత్యామ్నాయం”!

చక్కెర తగ్గించాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు కొంతమంది సాధారణ చక్కెరకు బదులుగా మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్‌ స్వీట్‌నర్స్‌ ఉపయోగిస్తుంటారు. అయితే ఇవి ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్లేదు.. కానీ రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి అదనపు క్యాలరీలు అందించినట్లే అని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి వీటి వాడకాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదంటున్నారు. వీటికి బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే, బరువును అదుపులో ఉంచుకునేందుకు తోడ్పడే తేనె, డేట్స్‌.. వంటి సహజసిద్ధమైన స్వీట్‌నర్స్‌ మంచివని వారు సూచిస్తున్నారు.

“స్నాక్స్‌తో చేటే”!

అది బ్రేక్‌ఫాస్ట్‌ అయినా, లంచ్‌-డిన్నర్‌ అయినా.. సమయానికి తినకపోతే విపరీతమైన ఆకలేయడం సహజం. దాంతో ఇతర చిరుతిండ్లవైపు మనసు లాగుతుంటుంది. అయితే ఇలా రోజులో ఎక్కువసార్లు పదే పదే ఏదో ఒక స్నాక్‌ తినడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్‌ స్థాయులు పెరుగుతాయంటున్నారు నిపుణులు. ఇన్సులిన్ అనేది కొవ్వును నిల్వ చేసే హార్మోన్‌. ఇలా ఇన్సులిన్‌ పెరగడం వల్ల కొవ్వు కూడా క్రమంగా పెరిగిపోతుంటుంది. ఇది బరువు తగ్గడానికి బదులుగా పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ఇన్సులిన్‌ను అదుపులో ఉంచుకోవాలంటే పదే పదే చిరుతిండ్లు తినడం మానేసి.. వేళకు భోజనం చేయాలి. అంతలా స్నాక్స్‌ తినాలన్న కోరిక కలిగితే ఆయా సీజన్లలో లభ్యమయ్యే పండ్లు, నట్స్‌, వెజిటబుల్‌ సలాడ్స్‌, సూప్స్‌.. వంటివి చక్కటి ఎంపిక.

“ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా”?

ఒక రోజు సెలవొచ్చినా ఆలస్యంగా నిద్ర లేవడానికి మొగ్గు చూపే వారు మనలో చాలామందే. అయితే ఇలా లేవడం వల్ల ఆ రోజు చేసే వ్యాయామం, తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌ దగ్గర్నుంచి లంచ్‌, డిన్నర్‌.. ఇలా అన్ని పనులూ ఆలస్యమవుతాయి. పైగా ఏడెనిమిది గంటలకు మించి నిద్ర పోవడం కూడా మన ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా రోజూ వేళకు నిద్రలేచి, ఒక రోజు ఆలస్యంగా నిద్ర లేవడం, రోజులో ఎప్పుడు పడితే అప్పుడు కునుకు తీయడం వల్ల శరీరం బద్ధకించి బరువు తగ్గడానికి బదులుగా మరింతగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాబట్టి రోజూ వేళకు నిద్ర పోవడం, నిద్ర లేవడం చేస్తే బరువు అదుపులో ఉంచుకోవడంతో పాటు ఆ రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండచ్చంటున్నారు నిపుణులు.

“20 నిమిషాలు ఇలా చేయండి”!

విటమిన్‌ ‘డి’ సరిగ్గా అందకపోయినా బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే రోజూ లేలేత ఎండలో ఓ ఇరవై నిమిషాల పాటు నిల్చోవడం వల్ల బీఎంఐ స్థాయులు తక్కువగా నమోదై బరువు అదుపులో ఉంటుంది. అలాగే శరీరంలో శక్తి స్థాయులు కూడా పెరుగుతాయి.

ఉదయాన్నే మనం చేసే వ్యాయామం ప్రభావం కూడా మన శరీరంపై చాలానే ఉంటుంది. సమయం లేదని వాయిదా వేయకుండా కాస్త వీలు చూసుకొని ఉదయాన్నే ఓ ఇరవై నిమిషాల పాటు చిన్న పాటి వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గాలన్న ఆశయం కొద్ది రోజుల్లోనే నెరవేరుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయాన్నే మనం చేసే కొన్ని పొరపాట్లు, మన అలవాట్లను సరిదిద్దుకోవడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చన్న విషయం తెలుసుకున్నారు కదా! అయితే ఆలస్యం చేయకుండా వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే బరువు తగ్గాలన్న లక్ష్యాన్ని త్వరలోనే చేరుకోవచ్చు.. ఏమంటారు?

Related posts