telugu navyamedia
వ్యాపార వార్తలు

వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త రిజిస్ట్రేషన్ విధానం

వాహన దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. వ్యక్తిగత వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేందుకు నూతన విధానాన్ని రూపొందించింది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ వెలువరించింది. ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాల్సిన అవసరం లేదు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ‘బీహెచ్‌'(భారత్‌ రిజిస్ట్రేషన్‌) రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ విధానం కింద వ్యక్తిగత వాహనాలకు మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసే అవసరం లేదని కేంద్రం స్పష్టంచేసింది.

కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు, ప్రైవేటు కంపెనీలు, వివిధ సంస్థల ఉద్యోగులు ఈ రిజిస్ట్రేషన్‌ సదుపాయాన్ని స్వచ్ఛందంగా ఉపయోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికైనా సులువుగా వెళ్లేందుకు వీలుపడుతుందని పేర్కొంది.

ప్రస్తుతం ఒక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ చేయించిన వాహనాన్ని గరిష్ఠంగా 12 నెలల వరకు మాత్రమే వేరే రాష్ట్రంలో ఉపయోగించే వీలుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ కాలం పాటు అక్కడ వాహనం నడపాలంటే వాహనాన్ని ఆ గడువులోగా మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించాలి. దీంతో చాలామంది ఉద్యోగులకు ఈ విషయంలో ఇబ్బందులు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం బీహెచ్‌ సిరీస్‌ను తీసుకొచ్చింది. బీహెచ్ సిరీస్ క్రింద వాహనాల రిజిస్ట్రేషన్ విధానం ప్రయోజనాన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులు పొందవచ్చు. ఇక, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య వ్యక్తిగత వాహనాలు స్వేచ్ఛగా సంచరించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది.

Related posts