telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

తినగ తినగ మునగ మేలు చేయు… పోషక విలువల గని

Moringa

మునగ.. పాశ్చాత్యలకు ఇది మేజికల్‌ ట్రీ. మన దగ్గర.. ‘అమ్మకు ప్రియనేస్తం’. ఎన్నో పోషక పదార్థాలు ఉండే మునగను ఏడాదికొక్కసారైనా.. కనీసం ఆషాఢంలోనైనా తినాలన్నారు పెద్దలు! ఒక్క ఆషాఢం అనే ఏంటి.. తరచూ తినాల్సిన ఆకు అని ఆధునిక వైద్యనిపుణులు అంటున్నారు. మునగాకు… ఆకు ఒక్కటే కాదు.. మునగ చెట్టు బెరడు నుంచి మునగ కాడలు, వాటిలోని గింజల దాకా అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. మునగ గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే.. అదో ఔషధాల నిధి. పోషక విలువల గని. అల్లోపతి, ఆయుర్వేదాలు రెండింటిలోనూ మునగకు విశిష్ట స్థానం ఉంది. ఇది యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. బాక్టీరియాపై ప్రభావశీలమైన యుద్ధం చేస్తుంది కాబట్టి ఎన్నో వ్యాధులకు శారీరక సమస్యలకు ఓ అత్యుత్తమ పరిష్కారంగా డాక్టర్లు చెబుతున్నారు. మునగ విత్తనాల్లో యాంటీఆక్సిడెంట్స్‌ ఉంటాయి. ఇవి వాపుల్ని, ఒత్తిడిని నయం చేస్తాయి. కణాలు దెబ్బతినకుండా అడ్డుకుంటాయి. కాలేయాన్ని, మూత్రపిండాల్ని, పేగుల్ని శుభ్రం చేసే గుణం ఉంది. కణాల డ్యామేజి జరక్కుండా చూస్తాయి.

Moringa

యాంటాసిడ్‌గా మునగాకు గ్యాస్ట్రిక్‌ అల్సర్లను నయం చేస్తుంది. ఊబకాయం, మధుమేహానికి మంచి మందు. కేన్సర్‌ చికిత్సలోనూ దీని పాత్రను ఇపుడిపుడే అంచనా వేస్తున్నారు. కండరాల నొప్పి, క్షీణతకు తగిన మందు. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల నిద్ర సరిగా పట్టేట్టు చేస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీల్లో రాళ్లు తొలగించడానికి, లివర్‌ సిరోసి్‌సకు ఇది అద్భుతమైన మందు అని ఆయుర్వేద డాక్టర్లు చెబుతున్నారు. 200 మిల్లీ గ్రాముల మునగాకు పొడి తింటే రక్తంలో షుగర్‌ లెవల్స్‌ దాదాపు 40ు తగ్గుతాయి. లైంగిక సామర్థ్యం పెరగడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది, తినడానికి ఘాటుగా ఉన్నా ఇది పరమౌషధం. దీన్ని కూరలలో కలిపి, కారంలో కలిపి, పప్పులో ఉడికించి తినడం అలవాటు చేసుకుంటే మంచిది. తినగ తినగ మునగ మేలు చేయు… బచ్చలి కూర కంటే 24 రెట్లు ఎక్కువ ఐరన్‌ ఇచ్చే ఆకు.. పాల కంటే 16 రెట్లు ఎక్కువ కాల్షియం ఇచ్చే ఆకు.. క్యారట్‌ కంటే 9 రెట్లు ఎక్కువ విటమిన్ ‌సి ఇచ్చే ఆకు.. అరటి పండులో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ పొటాషియం కలిగి ఉండే ఆకు.

drumstick

వంద గ్రాముల మునగాకులో ఏమేం పోషకాలుంటాయంటే..
మాంసకృత్తులు: 8.3 గ్రాములు
కాల్షియం: 434 మిల్లీగ్రాములు
పొటాషియం: 202 మిల్లీగ్రాములు
విటమిన్‌ ఎ: 738 మిల్లీగ్రాములు
విటమిన్‌ సి: 164 మిల్లీ గ్రాములు
పీచుపదార్థాలు: 19.2 గ్రాములు

మునగను ఇంగ్లిషులో మోరింగా అని, తమిళ మురుంగై అని అంటారు. ఇది మురుంగై అనే తమిళ పదం నుంచి వచ్చింది. తమిళనాట దీనిని విస్తారంగా సేద్యం చేస్తున్నారు. ఒక అంచనా ప్రకారం తమిళనాట దాదాపు లక్ష పైచిలుకు ఎకరాల్లో మునగ సాగవుతోంది. అక్కడి నుంచి మునగాకు, పొడి, విత్తనాలను అమెరికా ఎక్కువగా కొంటోంది. విదేశాలు వీటిని కాస్మెటిక్స్‌లోనూ, ఔషధాల తయారీలోనూ వాడుతున్నారని చెబుతున్నారు తమిళనాడు కు చెందిన మునగ ఎగుమతి కంపెనీ ఎస్‌వీఎం ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని ఎస్‌ ముత్తురాజ్‌. తమిళనాడులోనే కాదు.. ఏపీ, కర్ణాటక, ఒడిసాతో పాటు హిమాలయా పర్వత పాదాల వద్ద ఈ చెట్లు పెరుగుతాయి. ఘనా, మొజాంబిక్‌, నైజీరియా, కెన్యా, రువాండా, నైగర్‌, కంబోడియా, హైతీ, ఫిలిప్పీన్స్‌లోనూ మునగ పెరుగుతున్నది. అమెరికన్లు దీనిని భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. రూ.80 కిలో మునగాకు ఎగుమతి ధర. రూ.500 కిలో మునగవిత్తనాల ఎగుమతి ధర.

Moringa

మునగ భారత్‌లోనూ, అనేక ఆఫ్రికన్‌ దేశాల్లోనూ ఎదుగుతుంది. పశ్చిమదేశాల్లో కానరాదు. వీటిలోనూ భారత్‌ నుంచి వచ్చే మునగాకు శ్రేష్ఠమైనది. అందుకే- భారత్‌ నుంచి మునగ ఆకును అమెరికా, కెనడా, ఐరోపా దేశాలు, చైనా, జర్మనీ, దక్షిణ కొరియాల్లో దీనికోసం ఎగబడుతున్నాయి. అక్కడ మునగాకు పొడికి చాలా డిమాండ్‌ ఉంది. 2015లో భారత్‌ నుంచి రూ.146 కోట్ల విలువైన మునగ ఆకులు ఆయా దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మునగాకు వ్యాపారం దాదాపు 27 వేల కోట్లు. ఇంకో రెండేళ్ళలో ఇది రూ 47,500 కోట్లకు పెరగవచ్చు.

Related posts