telugu navyamedia
సినిమా వార్తలు

జూన్ 30న నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌లు

TFPC

జూన్ 30 న జరగబోయే తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల కోసం విడివిడిగా పోటీకి దిగిన సి. కళ్యాణ్, టి. ప్రసన్నకుమార్ ప్యానెల్స్ కలసి మన కౌన్సిల్, మన ప్యానెల్ పేరుతో పోటీకి దిగుతున్నాయి. గత కొన్నేళ్ళుగా స్తబ్దుగా ఉన్న నిర్మాతల మండలిలో ఇప్పుడు చలనం వచ్చింది. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత ఎన్నికలకు సిద్ధం అవుతోంది. అయితే ఈ సారి ఎన్నికలకు ముందు నిర్మాతలందరినీ ఒకే త్రాటి పైకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొంతమేరకు అవి సఫలం అయ్యాయి కూడా… విడివిడిగా పోటీకి దిగాలనుకున్న సి. కళ్యాణ్, ప్రసన్న కుమార్ ప్యానెల్స్ కలసి ఒకే ప్యానెల్ గా పోటీలో నిలువబోతున్నాయి. శనివారం నామినేషన్స్ కు ఆఖరు రోజు కావటంతో రెండు ప్యానెల్స్ కలసి 23 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీగా ఫామ్ అయి ‘మన కౌన్సిల్, మన ప్యానెల్’ పేరుతో 30 న జరగబోయే ఎన్నికలలో పోటీకి దిగుతున్నాయి.

గత కొన్ని సంవత్సరాలుగా ఎల్.ఎల్.పి. గిల్డ్ పేరుతో వేరు కుంపటి పెట్టికున్న యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ తోనూ చర్చలు జరుపుతున్నామని ఎన్నికలు పూర్తయిన తర్వాత అందరూ రాజీనామా చేసి చిత్ర పరిశ్రమ పెద్దల సలహాలు, సూచనలతో కౌన్సిల్ కొత్త బాడీని ఎంచుకుంటామంటున్నారు సి. కళ్యాణ్. ఎల్.ఎల్.పి. వేరు కుంపటి వల్ల నిర్మాతల మండలికి కొన్ని కోట్ల నష్టం వాటిల్లిందన్నారాయన. ఇకపై అన్నీ కౌన్సిల్ ద్వారానే జరిగేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. వేరు కుంపట్ల వల్ల నిర్మాతల మండలి ఉనికికే ప్రమాదం ఏర్పడటంతో తెలంగాణ ఫిలిమ్ డెవలప్ మెంట్ ఛైర్మన్ రామ్మోహనరావు, జి. ఆదిశేషగిరిరావు, చదలవాడ శ్రీనివాసరావుతో పాటు కోర్ కమిటి సభ్యులు అరవింద్, సురేశ్ బాబు, కె.ఎల్. నారాయణ వంటి పెద్దల ప్రయత్నంతో నిర్మాతలనందరినీ ఏకీకృతం చేసి ఒక్కటిగా ముందుకు సాగేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్.

Related posts