telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేవంత్‌ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు యత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుని కర్రలతో వెంటపడ్డారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లతో ఎదురు దాడి చేసేందుకు యత్నించారు.

గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్‌ల మధ్య ట్విటర్ వేదికగా జరుగుతున్న విమర్శలు, ప్రతి విమర్శలే రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి దారితీసింది. కేటీఆర్‌ మాదక ద్రవ్యాలు వాడలేదని, పరీక్షలు చేయించుకోవాలని డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్‌ను విసిరారు. నిన్న గన్ పార్కు వద్దకు రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ కేటీఆర్‌ రాలేదు. రేవంత్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఆయనపై పరువునష్టం దావా వేశారు.

ఈక్రమంలో ఇవాళ కొంతమంది తెరాస కార్యకర్తలు రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వెళ్లారు. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మతో ఆయన నివాసం వద్దకు వెళ్లిన తెరాస కార్యకర్తలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ శ్రేణులను అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

టీఆర్‌ఎస్‌ శ్రేణుల ముట్టడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. మళ్లీ గొడవ జరిగే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా రేవంత్ నివాసం వద్ద పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. రేవంత్‌ ఇంటికి 200 మీటర్ల వరకు ప్రత్యేక పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

Related posts