telugu navyamedia
ఆరోగ్యం వార్తలు

రిమ్స్ నుంచి 10మంది కరోనా బాధితుల పరారీ

corona

ఆదిలాబాద్ రిమ్స్‌ ఐసోలేషన్‌ కేంద్రం నుంచి 10 మంది కరోనా రోగులు పరారైన సంఘటన కలకలం రేపుతోంది. ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండగా, మరోవైపు రిమ్స్‌లో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఈ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవంటూ బాధితులు వారం రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న 10మంది కరోనా పాజిటివ్‌ వ్యక్తులు శనివారం రాత్రి తప్పించుకుని బయటకు వచ్చారు.
రిమ్స్‌ నుంచి తప్పించుకున్న బాధితులు కైలాస్‌నగర్‌, చాందా, టీచర్స్‌ కాలనీ, నిజామాబాద్‌, కొత్త కుమ్మరివాడ, ద్వారక నగర్‌, ఇంద్రవెల్లి, ఖానాపూర్‌కు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఇక తప్పించుకున్నవారి ముగ్గురిని గుర్తించినట్లు వైద్యాధికారులు, పోలీసులు తెలిపారు. ఇద్దరు ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన వ్యక్తుల్ని తిరిగి రిమ్స్‌కు తరలించారు. ఇంద్రవెల్లికి చెందిన ఒకరిని హోం ఐసోలేషన్‌లో ఉంచేందుకు అనుమతి ఇచ్చారు. అయితే మిగిలిన వారు ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు. వారు జన సంచారంలో కలిస్తే చాలా మంది కరోనా బారిన పడే అవకాశం ఉంటుందని అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐసోలేషన్‌ కేంద్రం నుంచి పదిమంది కరోనా రోగులు పరారయ్యారనేది అవాస్తవమని రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ కొట్టిపారేశారు. వారు పండుగ కోసం అనుమతి తీసుకుని వెళ్లారని, వారు తిరిగి రిమ్స్‌కు వచ్చేశారని తెలిపారు.

Related posts