telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

పట్టా మార్పిడికి రూ. 10 లక్షలు లంచం.. ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

acb telangana

పట్టా మార్పిడి కోసం ఓ రైతు వద్ద నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా మారేపల్లికి చెందిన రైతు దోమ వెంకటయ్య 2016లో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నుంచి 2.25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిని తన పేరున మార్చుకునేందుకు తహసీల్దారుకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆ భూమిని తాను ఎప్పుడో కొన్నానని, కాబట్టి పట్టా మార్చొద్దని రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో నాలుగేళ్లుగా ఈ భూమి పట్టా వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది.

కలెక్టరేట్‌లో డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న జయలక్ష్మి విషయం తెలిసి సమస్యను తాను పరిష్కరిస్తానని, రూ. 13 లక్షలు ఇస్తే పట్టా మారుస్తానని వెంకటయ్యకు చెప్పింది. సరేనన్న వెంకటయ్య విడతలవారీగా రూ. 10 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని విషయాన్ని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సలహా మేరకు నిన్న సాయంత్రం కలెక్టరేట్‌లో జయలక్ష్మికి లక్ష రూపాయలు ఇచ్చాడు. ఆమె డబ్బును లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Related posts