telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కేంద్ర సహాయమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారం

kishan reddy mp

తెలంగాణ ఎంపీ జి. కిషన్ రెడ్డి కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ గురువారం సాయంత్రం కిషన్ రెడ్డితో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. అయితే, ప్రమాణపత్రం చదవడంలో కిషన్ రెడ్డి కాస్త ఇబ్బంది పడ్డారు. హిందీలో ఉన్న ప్రమాణపత్రం చదువుతూ పలుమార్లు తడబడ్డారు. రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఆ పదాలను కిషన్ రెడ్డితో తిరిగి పలికించారు.

ఎట్టకేలకు ప్రమాణస్వీకారం పూర్తిచేసిన కిషన్ రెడ్డి అత్యంత విధేయతతో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపి అక్కడినుంచి నిష్క్రమించారు. లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానం నుంచి ఘనవిజయం సాధించిన కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఖాయం అంటూ కొన్నిరోజుల నుంచే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఎంవో నుంచి ఆయనకు ఫోన్ రావడంతో మంత్రిగా ఆయన పదవీప్రమాణం చేశారు.

భారతీయ జనతా పార్టీలో చిన్న స్థాయి కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన జి. కిషన్‌ రెడ్డి అంచెలంచెలుగా ఎదిగారు. హిమాయత్‌నగర్‌ ఎమ్మెల్యేగా ఒకసారి, అంబర్‌పేట ఎమ్మెల్యేగా వరుసగా రెండు సార్లు గెలిచిన కిషన్‌ రెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. నిత్యం ప్రజలతో మమేకమై ఉండే కిషన్‌ రెడ్డి.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన కిషన్ రెడ్డికి ప్రధాని మోదీ కేబినెట్‌ లో స్థానం లభించింది.

Related posts