telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రభుత్వం .. ఆర్టీసీ కార్మికులతో చర్చించాలి.. : హైకోర్టు

high court on new building in telangana

నేటికీ ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలై పదకొండు రోజులు అవుతుంది. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం దిగిరావటం లేదు. అయితే ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చర్చల ద్వారా ఎలాంటి సమస్యలు అయినా పరిష్కరించుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. సమ్మె ప్రభావం ప్రజలపై పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే విద్యాసంస్థలకు సెలవులు ఎందుకు పొడిగించారని హైకోర్టు ప్రశ్నించింది. సుమారు నాలుగువేల బస్సులు నడవడం లేదని.. దీని వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కార్మికులు సమ్మె విరమించాలని, ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించాలని హైకోర్టు సూచించింది.

దీనికి ప్రభుత్వం సమాధానం ఇస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యంకాదని చెప్పింది. సుమారు 75 శాతం బస్సులు నడుస్తున్నాయని, మిగితావాటిని త్వరలో పునరుద్ధరిస్తామని.. కార్మికులను చర్చలకు పిలవము అని పరోక్షంగా చెప్పింది. దీంతో హైకోర్టు ఆగ్రహించింది. నాలుగువేల బస్సులకు డ్రైవర్లను, కండక్టర్లను ఎలా తెస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సమస్య ఆర్టీసీ యాజమాన్యం, కార్మికుల మధ్య మాత్రమే కాదని అది ప్రజల సమస్యగా మారిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఆర్టీసీ కార్మికులపైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ఎందుకు అమలు చేయకూడదో చెప్పాలని కార్మిక సంఘాలను హైకోర్టు ప్రశ్నించింది. కార్మికుల డిమాండ్లు న్యాయ సమ్మతం కావొచ్చు కానీ పండుగ సమయంలో రవాణా నిలిపివేస్తే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఇబ్బందులను కార్మిక సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈ నెల 18న సమ్మెపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు అన్నది చెప్పాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts