telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్‌..

Hyderabad Roads

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ నెలాఖరు వరకు అత్యవసర సేవలు మినహా అన్నీ బంద్‌ కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే అన్ని రైళ్ళను రద్దు చేయగా, మెట్రోరైలు , ఆర్టీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్‌లను 31వ తేదీ వరకు రోడ్డెక్కించవద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ప్రజా రవాణాలో భాగమైన ఏ ఒక్క వాహనం కదలదు. దక్షిణమధ్య రైల్వేలో భాగంగా నగర రవాణాలో కీలక భూమిక పోషిస్తున్న 121 ఎంఎంటీఎస్‌ రైళ్లతోపాటు 30 సబర్బన్‌ రైళ్లను నిలిపివేయనున్నారు.

ప్రజలకు నిత్యావసరవస్తువుల విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇంటికి కావాల్సిన పాలు, కూరగాయలు, ఇతర సరుకులు తీసుకువచ్చేందుకు..ఆ ఇంటిలోని ఒక్క వ్యక్తికి మాత్రమే బయటకు వెళ్లే అనుమతివ్వడం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ ప్రతీ ఇంట్లో ఒక్కొక్కరి 12 కిలోల చొప్పున నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. బియ్యంతోపాటు ఇతర సరుకుల కొనుగోలు కోసం రూ.1500 నగదు అందజేస్తమన్నారు.

Related posts