telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

యూత్ క్లబ్ లకు .. తెరలేపుతున్న తెలంగాణ ప్రభుత్వం.. దరఖాస్తులు ఆహ్వానం..

huge job notification in telanganaf

తెలంగాణ ప్రభుత్వం నేటి ఆధునిక యువతలో సామాజిక చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చదువుతోపాటు సేవా కార్యక్రమాలు కూడా జీవితంలో భాగమని యువతకు దిశానిర్దేశం చేసేందుకు గాను తాజాగా యువ చేతన పేరుతో సరికొత్త కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15-35 సంవత్సరాల్లోపు ఉన్న యువజనులతో(అమ్మాయిలు, అబ్బాయిలు) యువజన క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కరు ఆర్గనైజర్‌గా, మరొక్కరు డిప్యూటీ ఆర్గనైజర్లుగా ఉండేలా క్లబ్‌లను ఏర్పాటు చేయాలని జిల్లాల వారీగా కలెక్టర్లకు, యువజన సంక్షేమ శాఖ అధికారులకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీవోలకు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో మహిళల సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల వలనే ఒక్కో యూత్‌క్లబ్‌లో సుమారు 10-15 మంది యువజనులు ఉండేలా మండల సమితి స్థాయిలో యువజన క్లబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ యువచేతన కార్యక్రమంలో కలెక్టర్ నోడల్ అధికారిగా, అడిషనల్ జాయింట్ కలెక్టర్ అసిస్టెంట్ నోడల్ అధికారిగా, జిల్లా యువజన సర్వీసుల, సంక్షేమశాఖ అధికారి సమన్వయకర్తగా ఉంటారు. నూతనంగా ఏర్పాటైన యూత్ క్లబ్‌లకు ప్రభుత్వం చేయూతనివ్వడంతోపాటు, క్రీడాసామగ్రిని ఉచితంగా బహూకరిస్తుందని, మున్ముందు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు రుణసాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు.

ఖాళీ సమయాల్లో యూత్‌క్లబ్‌లోని యువత ముఖ్యంగా వారు నివసిస్తున్న ప్రాంతంలో నూతనంగా మొక్కలు నాటడం, చెట్లను పెంచేలా కాలనీ, బస్తీ ప్రజలను ప్రోత్సహించడం చేయాలి. స్కూల్‌కు వెళ్లని చిన్నారులను వారి తల్లిదండ్రులతో చర్చించి వెంటనే స్కూల్‌లో చేర్పించాలి. స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ మేడ్చల్‌లో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా శ్రమదాన కార్యక్రమాలు చేపట్టాలి. జాతీయ పండుగ(ఆగస్టు 15, జనవరి 26)లను నిర్వహించి జాతీయ సమైఖ్యతలో పాలుపంచుకోవాలి. క్రీడల నిర్వహణ, సేవా కార్యక్రమాలు చేయాలి. అవయవదానాల వలన కలిగే ప్రయోజనాలను కాలనీ ప్రజలకు వివరించాలి. క్రమం తప్పకుండా బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహించడం చేయాలి.

సమష్టి అభివృద్ధికి యువ చేతన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక ప్రాంతంలోని యువజనులందరూ యూత్‌క్లబ్‌గా ఏర్పడటం వలన ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే కేవలం 10వ తరగతి పూర్తయిన విద్యార్థుల నుంచి 35 సంవత్సరాల్లోపు యువత సామాజిక కార్యక్రమాలు చేపట్టడం వలన భవిష్యత్ తరాలకు మంచి బాటలు వేసినవారవుతారు. యువజనులందరూ ఈ క్లబ్‌లో సభ్యులుగా చేరాలి. జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల్లోని యువతీయువకులు యువచేతన సంఘాలను ఏర్పాటు చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఎంపీడీవో/తహసీల్దార్ కార్యాలయాల్లో గానీ, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్-బి బ్లాక్‌లో గల జిల్లా క్రీడలు యువజన సర్వీసులశాఖ అధికారి కార్యాలయంలో ఈనెల 31వ తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని ఆయన కోరారు.

Related posts