• Home
  • వార్తలు
  • తెలంగాణ కాంగ్రెస్ ఆ నిజాన్ని గుర్తిస్తుందా…?
రాజకీయ వార్తలు వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ ఆ నిజాన్ని గుర్తిస్తుందా…?

telangana congress attitude towards elections
ప్ర‌భుత్వాలు కానీ, మరేదైనా సంస్థ‌లు కానీ ప్ర‌జోప‌యోగ కార్య‌క్ర‌మాలు లాంటివి చేసిన‌ప్పుడు అవ‌స‌రానికి మించి ప్ర‌చారార్భాటాల‌కు దిగ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అస‌లు ప్ర‌భుత్వాలు సంక్షేమ కార్య‌క్ర‌మాలకు కేటాయించిన మొత్తం క‌న్నా…వాటి ప్ర‌చారానికి ఎక్కువ మొత్తం వెచ్చిస్తాయ‌నే ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. చేసేది చిన్న ప‌న‌యినా దాన్ని విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలంటే ప్ర‌చారం త‌ప్ప‌నిస‌రనే పాల‌కులు న‌మ్ముతారు. ఊరూవాడా ఎలుగెత్తి త‌మ గొప్ప‌త‌నాన్ని చాటుకుంటారు. అయితే ఇది అంద‌రి వ‌ల్లా కాదు. చేసింది కొండంత ఉన్నా…గోరంత ప్రచారం చేసుకోవ‌డం చేత‌కాని నేత‌లు కూడా మ‌న‌దగ్గ‌ర ఉన్నారు. ఏ ప్రాంతీయ పార్టీ నేత‌లో, లేదా కొత్త‌గా ఆవిర్భ‌వించిన పార్టీ నాయ‌కుల గురించో కాదు..మ‌నం చెప్పుకుంటోంది.
telangana congress attitude towards elections
దేశంలోనే సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన అతిపురాత‌న పార్టీ కాంగ్రెస్ గురించి. అతిశ‌యోక్తులు, ఆడంబరాల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే త‌మ గురించి, ప్ర‌జ‌ల‌కు తాము చేసిన మేలు గురించి ఉన్న‌ది ఉన్న‌ట్టుగా చెప్పుకోవ‌డం కూడా తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులకు రాదు. తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత నుంచి ఇప్ప‌టిదాకా వారు క‌న‌బ‌రుస్తున్న‌ వ్య‌వ‌హార‌శైలే ఇందుకు నిద‌ర్శ‌నం. 2014లో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను విభ‌జించి తెలంగాణను ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించ‌డానికి కాంగ్రెస్ ఎన్ని క‌ష్టాలు ప‌డిందో, ఎంత వ్య‌య‌ప్ర‌యాస‌ల కోర్చిందో దేశ‌మంతా చూసింది. 2004లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇచ్చిన హామీని నెర‌వేర్చేందుకు అదును కోసం ఎదురుచూశారు అప్ప‌టి కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ.  కేసీఆర్ దీక్ష స‌మ‌యంలో 2009లో ప్ర‌త్యేక రాష్ట్రంపై అప్ప‌టి హోం మంత్రి చిదంబ‌రం అర్ధ‌రాత్రి చేసిన ప్ర‌క‌ట‌న 2004లో సోనియాగాంధీ ఇచ్చిన ఎన్నిక‌ల హామీ ఫ‌లిత‌మే. తాను ప్ర‌త్యేక రాష్ట్రం కోసం ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోవాల‌ని సోనియాగాంధీ అనుకున్నారు కాబ‌ట్టే ఆ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది త‌ప్ప‌…కేసీఆర్ దీక్ష‌కు భ‌య‌ప‌డో, బెదిరో కాదు.  సుదీర్ఘ పార్టీ చ‌రిత్ర‌లో ఇలాంటి దీక్ష‌ల‌ను కాంగ్రెస్ చాలానే చూసింది. ఇలాంటి దీక్ష‌ల‌కు జాతీయ పార్టీలు తలొగ్గ‌వు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను గ‌మ‌నించే సోనియా తెలంగాణ‌కు మొగ్గుచూపారు.
 
కేసీఆర్ దీక్ష అన్న‌ది తెలంగాణ ప్ర‌క‌ట‌న‌కు ఓ సంద‌ర్భం త‌ప్ప‌….అనివార్య‌త కాదు. ఇందుకు 2009 త‌ర్వాత చోటుచేసుకున్న ప‌రిణామాలే నిద‌ర్శ‌నం. చిదంబ‌రం ప్ర‌క‌టన త‌ర్వాత ఆంధ్రా ఎంపీలు పార్టీల‌క‌తీతంగా చేసిన రాజీనామాల‌తో వ్యూహాత్మ‌కంగా సోనియా వెన‌క్కి త‌గ్గారు. కేంద్ర‌ప్ర‌భుత్వం శ్రీకృష్ణ క‌మిటీ ఏర్పాటుచేసింది. నిజానికి 2009లో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్య‌మం ఆ త‌ర్వాత కాలంలో కాస్త త‌గ్గింద‌ని చెప్పొచ్చు. మిలియ‌న్ మార్చ్ లు, స‌క‌ల జ‌నుల స‌మ్మె వంటివాటితో ఉద్య‌మం సాగిన‌ప్ప‌టికీ..2009 నాటి వేడి త‌ర్వాతి కాలంలో లేదు. అలాంటి సంద‌ర్భంలో తెలంగాణ కోసం కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో ఒత్తిడి తేగ‌లస్థితిలో కేసీఆర్ కానీ, ఆయ‌న పార్టీ టీఆర్ ఎస్ కానీ లేదు. అయిన‌ప్ప‌టికీ…సోనియా గాంధీ త‌నంత‌తానుగా ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని మ‌ళ్లీ తెర‌పైకి తెచ్చారు. ఎన్నిక‌లకు ఏడాది స‌మ‌యం ముందు చ‌క‌చ‌కా ప్ర‌క్రియ ప్రారంభించారు. 2009లో చేసిన చిదంబ‌రం ప్ర‌క‌ట‌న ఆధారంగానే తెలంగాణ ఏర్పాటును ముందుకు న‌డిపారు. ప్ర‌భుత్వ మ‌నుగ‌డ కోసం 2009లో వెన‌క్కి త‌గ్గిన సోనియాగాంధీ, 2014లో తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను నెర‌వేర్చారు.  ఇచ్చిన హామీ నెర‌వేర్చే క్ర‌మంలో రాజ‌కీయ న‌ష్టాల‌ను ఎదుర్కోవ‌డానికి కూడా ఆమె సిద్ద‌మ‌య్యారు. రాష్ట్ర విభ‌జ‌న‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌ని.. తెలంగాణ ఏర్పాటుచేస్తే ఏపీలో కాంగ్రెస్ కు పుట్ట‌గ‌తులు కూడా ఉండ‌వ‌నీ సోనియా ఊహించ‌గ‌లిగారు. అయిన‌ప్ప‌టికీ…ఏపీలో పార్టీని ప‌ణంగా పెట్టి తెలంగాణ కోసం నిల‌బ‌డ్డారు సోనియా. ద‌శాబ్దాల తెలంగాణ వాసుల క‌ల‌ల‌ను నెర‌వేర్చారు. ఎంద‌రో యువ‌కుల బ‌లిదానాల‌ను ఆపారు. తెలంగాణ‌కు కొత్త చ‌రిత్ర లిఖించారు.
telangana congress attitude towards elections
రాష్ట్రం ఏర్ప‌డుతూనే దేశం ఎన్నిక‌ల క్షేత్రంలోకి దిగింది.  తెలంగాణ ప్ర‌జ‌ల జీవిత‌ల‌క్ష్యాన్ని నెరవేర్చిన కాంగ్రెస్ కు నిజానికి ఆ ఎన్నిక‌ల్లో ఎంతో లాభం క‌లగాలి. రాష్ట్ర ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ అంటే ఆరాధ‌నాభావం ఉండాలి. ఆ పార్టీకి ఓట్లువేసేందుకు జ‌నం బారులు తీరాలి. కానీ వాస్త‌వంలో ఇందుకు విరుద్ధంగా జ‌రిగింది. తెలంగాణ ఆవిర్భావంలో కాంగ్రెస్ పాత్ర‌ను ప్ర‌జ‌లు గుర్తించ‌లేదు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ ఎదుర్కొన్న క‌ష్ట‌నష్టాల‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకోలేదు. దీనికి తెలంగాణ ఉద్యమ పితామ‌హుడిగా త‌న‌ను తాను చెప్పుకుంటున్న కేసీఆర్ ఒక్క‌రే కార‌ణం కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల నిష్క్రియా ప‌రత్వం కూడా. కాంగ్రెస్ వ‌ల్లే తెలంగాణ క‌ల సాకార‌మ‌యింద‌న్న నిజాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్ల‌డంలో తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు.  రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ చేసిన విశేష‌కృషిని ప్ర‌జ‌ల‌కు వివ‌రించే సత్తా ఉన్న నేతలు లేక… ఎన్నిక‌ల్లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించింది. ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైంది. మ‌రి ఎన్నిక‌ల త‌ర్వాతైనా ఆ పార్టీ నేత‌ల తీరులో మార్పు వ‌చ్చిందా అంటే లేద‌నే చెప్పాలి.
 
తెలంగాణ కోసం, రాష్ట్ర ప్ర‌జ‌ల క‌ల నెర‌వ‌ర్చ‌డం కోసం కాంగ్రెస్ ఎంత క‌ష్ట‌ప‌డిందో, రాష్ట్రం ఏర్ప‌డ‌డానికి కార‌ణం ఎవ‌రో కాంగ్రెస్ నేత‌లు ప్ర‌జ‌ల‌కు చెప్పే ప్ర‌య‌త్నం ఈ నాలుగున్న‌రేళ్ల కాలంలోనూ ఎప్పుడూ చేయ‌లేదు. అప్పుడే కాదు..ముంద‌స్తు ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ నేత‌లు ఈ అంశాన్ని ఉప‌యోగించుకోలేక‌పోతున్నారు. తెలంగాణ ఏర్పాటులో సోనియాగాంధీ చూపిన తెగువ‌, సాహ‌సం ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌గ‌లిగితే వారి ఆలోచ‌నావిధానం కాంగ్రెస్ కు అనుకూలంగా మారిపోతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్ర‌జ‌లు ఇప్పుడు నిజానిజాలు గుర్తిస్తున్నారు.  కాంగ్రెస్ లేక‌పోతే…2014లో తెలంగాణ ఏర్ప‌డేదికాద‌న్న అభిప్రాయాన్ని మెజార్టీ ప్ర‌జ‌లు అంగీక‌రిస్తున్నారు. తెలంగాణ తెచ్చిన వ్య‌క్తిగా కేసీఆర్ పై చూపిన అపార కృత‌జ్ఞ‌త నుంచి బ‌య‌ట‌ప‌డుతున్నారు. ప్ర‌త్యేక రాష్ట్ర క‌ల నెర‌వేర‌డంలో టీఆర్ ఎస్ పాత్ర ఎంతో ఉందో, కాంగ్రెస్ పాత్రా అంతే ఉంద‌ని న‌మ్ముతున్నారు.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పై  తెలంగాణ తెచ్చిన పార్టీ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లు అర్ధ‌ర‌హిత‌మని భావిస్తున్నారు.
telangana congress attitude towards elections
తెలంగాణ ఏర్పాటుచేస్తే టీఆర్ ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తాన‌ని చెప్పిన కేసీఆర్…రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే మాట‌మార్చ‌డాన్ని ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేదు. పార్ల‌మెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన  త‌ర్వాత కేసీఆర్ స‌కుటుంబ స‌ప‌రివార‌స‌మేతంగా  త‌ర‌లివెళ్లి సోనియాగాంధీతో దిగిన గ్రూప్ ఫొటో ప్ర‌జ‌ల దృష్టిప‌థం నుంచి చెరిగిపోలేదు. తెలంగాణ ఇచ్చింది అమ్మో, బొమ్మో కాదని, తెలంగాణ ఆల‌స్యంగా ఇచ్చి ఎంద‌రో అమాయ‌కుల ప్రాణాలు పోవ‌డానికి కార‌ణ‌మ‌య్యార‌ని సోనియాగాంధీనుద్దేశించి టీఆర్ ఎస్ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌లను ప్ర‌జ‌లు స్వాగ‌తించ‌డం లేదు. ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్న నేత‌ల‌ను కృత‌జ్ఞ‌త‌లేనివారుగానే ప్ర‌జ‌లు ప‌రిగ‌ణిస్తున్నారు. ఇది గ‌మ‌నించ‌యినా  రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కులు మేల్కొనాలి.  తెలంగాణ ఏర్పాటు ఘ‌న‌త‌ను అందిపుచ్చుకోవాలి. ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ నేత‌లు కేసీఆర్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేయ‌డంతో స‌రిపుచ్చకుండా కాంగ్రెస్ వ‌ల్లే తెలంగాణ ఏర్పాట‌యింద‌న్న విష‌యాన్ని ప‌దే ప‌దే ప్ర‌జ‌ల‌కు గుర్తుచేయాలి. ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త ద్వారా వ‌చ్చే నెగ‌టివ్ ఓట్ల పై కాకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీ అన్న గుర్తింపు ద్వారా ల‌భించే పాజిటివ్ ఓట్లపై దృష్టిపెట్టాలి.  తెలంగాణ తెచ్చిన పార్టీకి ఓ అవ‌కాశం ఇచ్చిన‌ట్టే…ఇచ్చిన పార్టీకీ ఓ అవకాశం ఇచ్చి చూడాలన్న అభిప్రాయాన్ని ప్ర‌జ‌ల్లో క‌లిగించ‌డంలోనే  ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం దాగుంద‌న్న నిజాన్ని గుర్తించాలి. 

Related posts

పాము తన గుడ్లను తానే తిన్నట్టుగా…జంతువు నుండి వచ్చిన మనిషి మళ్ళీ…

chandra sekkhar

జైట్లీ ప్రకటనను అపార్థం చేసుకున్నారు : పురంధేశ్వరి

admin

అన్నీ నిర్ధారించుకున్నాకే అరెస్టు చేశాం: మహారాష్ట్ర డీజీ

madhu

Leave a Comment