telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మోగిన ఆర్టీసీ సమ్మె సైరన్.. ఎస్మా అస్త్రంతో కేసీఆర్.. తగ్గేది లేదంటున్న కార్మికులు..

Tsrtc increase salaries double duty employees

దసరా పండుగ సమయంలో సమ్మెకు వెళ్లడం మంచిది కాదని, సమ్మెను విరమించుకోవాలని త్రిసభ్య కమిటీ ఆర్టీసీ కార్మిక సంఘాల ను కోరింది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీ కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసు ఇవ్వడం, సమ్మెకు వెళ్తే చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించడం చేసింది ప్రభుత్వం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం చేస్తూ ఇబ్బంది రాకుండా చూడడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్టీసీ సమ్మెలో ఎవరైనా కార్మికులు పాల్గొంటే సీరియస్ గా చర్యలు తీసుకుంటామని చెబుతున్న నేపథ్యంలో ఎస్మా ప్రయోగిస్తారేమో అన్న ఆందోళన ఆర్టీసీ కార్మికులలో నెలకొంది. సీఎం కేసీఆర్ నాటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను స్ఫూర్తిగా తీసుకొని ఎస్మా ప్రయోగిస్తారా అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్ హాట్ గా జరుగుతోంది.

హైదరాబాద్ ఎర్రమంజిల్ లో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో ఐఏఎస్ కమిటీ జరిపిన చర్చలు , కార్మిక సంఘాల నాయకులకు సంతృప్తినివ్వలేదు. చర్చలు ఫెయిలయ్యాయని పేర్కొన్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి సమ్మెకు వెళుతున్నామని తేల్చిచెప్పారు. ఆర్టీసీలో కార్మికులందరూ ప్రజాసేవకులే.. చట్టంలోని ఓ సెక్షన్ ఇదే విషయం చెబుతోంది. ఎస్మా ప్రకారం సమ్మెకు పోతే ఉద్యోగాలు పోవడం ఖాయం. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది. గతంలో తమిళనాడులో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు సమ్మెకు వెళ్లినపుడు నిర్దాక్షిణ్యంగా ఎస్మా ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగించారు జయలలిత. దాదాపుగా లక్ష మంది వరకూ ఉద్యోగాలు కోల్పోయారు అని అప్పుడు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తెలంగాణలో కూడా జయలలిత తరహాలో సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవచ్చు. ఎస్మా ప్రయోగిస్తే ఉద్యోగాలు పోవచ్చు అని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఎస్మా… అత్యవసర సేవల నిర్వహణ చట్టం. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా జీవనానికి అంతరాయం కలగకుండా ఉండడం కోసం ఈ చట్టాన్ని ప్రభుత్వం ప్రయోగిస్తుంది. పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్టీసీ కార్మికులు తమ విధులను బహిష్కరించిన నేపథ్యంలో ప్రజా జీవనానికి అంతరాయం కలుగుతుంది కాబట్టి ఎస్మా ను ప్రయోగించాలి అనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ చట్టం ఆధారంగా తమ డిమాండ్ల సాధనకు పూనుకున్న తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష మందిని 2003 లో నాటి ముఖ్యమంత్రి జయలలిత ఒక్క కలం పోటుతో తీసి పారేశారు. ప్రజాగ్రహానికి గురైన జయలలిత తరువాతి ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కెసిఆర్ ఎప్పుడో సమస్యలు పరిష్కరిస్తారు అంటే నమ్మే స్థితిలో లేరు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి కెసిఆర్ ఇప్పుడు చొరవ తీసుకోవాలి అనేదే కార్మికుల ఆలోచన. సీఎం కేసీఆర్ కానీ, ట్రబుల్ షూటర్స్ అయిన మంత్రులు కానీ కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపకుండా త్రిసభ్య కమిటీ వేసి చేతులు దులుపుకోవడం, సమ్మె కి వెళితే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించడం ఆర్టీసీ పట్ల సీఎం కేసీఆర్ కు ఉన్న చిత్తశుద్ధిని చెబుతోందని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఆందోళన అణచివేసే ప్రయత్నం కెసిఆర్ చేస్తుంటే, ఒకవేళ అదే గనుక జరిగితే ఆందోళన మరింత ఉధృతమవుతోందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Related posts