telugu navyamedia
తెలంగాణ వార్తలు

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యి శాసనసభ, మండలి.. అక్టోబర్‌ 1 వరకు కొనసాగే అవకాశముంది. సభ జరిగే తేదీలు, ఎజెండా తదితరాలపై అసెంబ్లీ సమావేశాల తొలి రోజున జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయిస్తారు.

రేపు అసెంబ్లీ సమావేశమైన తర్వాత ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులు, మండలి సభ్యుల మృతికి సంతాపం ప్రకటించి వాయిదా పడే అవకాశాలున్నాయి. శని, ఆది వారాల్లో విరామం తర్వాత తిరిగి ఈ నెల 27 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సభలు సాగే అవకాశముంది. ప్రొటెమ్‌ చైర్మన్‌ హోదాలో వెన్నవరం భూపాల్‌రెడ్డి తొలిసారి మండలి సమావేశాలను నిర్వహించనున్నారు.

అలాగే ఈ ఏడాది మార్చిలో జరిగిన ఎన్నికలో పట్టభద్రుల కోటాలో ఎన్నికైన సురభి వాణీదేవి తొలిసారిగా, పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరుసగా రెండో సారి మండలిలో అడుగుపెడుతున్నారు. నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన నోముల భగత్‌ కూడా తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు.

Telengana bypoll: Opposition parties call TRS's new 'Dalit Bandhu' scheme a  'bluff', plan rallies against party - News Analysis News

ఈ సమావేశాల్లో దళితబంధు పథకం అమలు సహా పంటలసాగు, తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు, ఉద్యోగాల నియామకం, ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపు సహా ఇతర అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశాలు , శాంతి భద్రతలు, మహిళలు-చిన్నారులపై దాడులు, డ్రగ్స్ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. మొత్తం 8 బిల్లులను ప్రభుత్వం ఈ ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది.

కోవిడ్‌ నిబంధనలు..
అసెంబ్లీ సమావేశాలను కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో మాదిరిగానే పోలీస్, మీడియా, అధికారులు, శాసనసభ, మండలి సభ్యుల వెంట వచ్చే సహాయ సిబ్బందిని పరిమిత సంఖ్యలో అనుమతించాలని నిర్ణయించారు. ఎవరికైనా కోవిడ్‌ లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా అసెంబ్లీ ఆవరణలో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు వ్యాక్సినేషన్‌ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి తొలి, రెండో దశ కోవిడ్‌ టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు.

 

Related posts