telugu navyamedia
క్రీడలు వార్తలు

ఆ ప్రక్రియను ఎందుకు మార్చారో అర్థంకావడం లేదు : కోహ్లీ

birthday wishes to virat kohli

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్లను లెక్కించే ప్రక్రియను ఎందుకు మార్చారో అర్థంకావడం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు సంబంధించిన రూల్స్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి తాజాగా మార్చేసింది. ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా వ‌చ్చిన పాయింట్ల‌తో ఆయా జ‌ట్ల‌కు ర్యాంకులు ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. పాయింట్ల కేటాయింపు విధానంలో ఐసీసీ మార్పులు చేయడంతో.. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. భారత్‌ను వెనక్కి నెడుతూ ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియాతో తొలి వన్డేకు ముందు విరాట్ కోహ్లీ ఆన్‌లైన్‌లో మీడియాతో మాట్లాడాడు. ‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్లను లెక్కించే ప్రక్రియను ఎందుకు మార్చారో అర్థంకావడం లేదు. కాస్త గందరగోళంగా అనిపిస్తోంది. ఇందుకు ఐసీసీ సరైన వివరణ ఇవ్వాలి. ముందు పాయింట్ల పరంగా టాప్‌-2లో నిలిచిన జట్లతో ఫైనల్‌ ఆడిస్తామని చెప్పి.. ఇప్పుడు విజయాల శాతం ఎందుకు లెక్కిస్తున్నారు’ అని విరాట్ కోహ్లీ ప్రశ్నించాడు.

‘యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మేం భావిస్తున్నాం. ఆస్ట్రేలియా లాంటి చోట ఆడాలని వారెంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తమ సత్తా చాటేందుకు, స్థాయిని పెంచుకునేందుకు వారికి ఇది సరైన వేదిక. బుమ్రా, షమీలకు తగినంత విశ్రాంతి ఇవ్వాలనేది టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఆలోచన. వారి స్థానాల్లో కుర్రాళ్లు ఆడతారు. ఆస్ట్రేలియా జట్టు ఆధిపత్యం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి సిరీస్‌ హోరాహోరీగా సాగడం ఖాయం. అయితే వారిని ఓడించేందుకు మాకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రేరణా అవసరం లేదు. మేం అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం. పర్యటన శుభారంభం చేస్తే మంచిదే కానీ అదే సర్వస్వం కాదు. ప్రతీ మ్యాచ్‌ మాకు కీలకమే’ అని కోహ్లీ తెలిపాడు. 2019 ఆగస్టు నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభం అయింది. ఇప్పటివరకూ నాలుగు టెస్టు సిరీస్‌లను భారత్ ఆడింది. కోహ్లీసేన 9 మ్యాచ్‌లు ఆడి.. ఏడింట్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. మొత్తంగా 480 పాయింట్లకి భారత్ 360 పాయింట్లు సాధించింది. అంటే 75 శాతం పాయింట్లు దక్కించుకుంది. ఆస్ట్రేలియా మూడు సిరీస్‌ల రూపంలో మొత్తం 10 మ్యాచ్‌లు ఆడగా.. ఏడింట్లో గెలుపొంది, రెండింట్లో ఓడిపోయి, ఒక మ్యాచ్‌ని డ్రాగా ముగించింది. మొత్తంగా 360 పాయింట్లకిగానూ 296 పాయింట్లు సాధించింది. అంటే దాదాపు 82 శాతం పాయింట్లని దక్కించుకుంది. దాంతో ఆస్ట్రేలియా నెం.1 స్థానానికి ఎగబాకింది. భారత్‌ నెం.1 ర్యాంక్ చేజారింది.

Related posts