telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అడిగే హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుంది: గల్లా జయదేవ్

MP Galla Jaayadev challenge Modugula

పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానిని అడిగే హక్కు ప్రతి భారతీయుడికి ఉంటుందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత దేశ ప్రధానికి ఉంటుందని ఆయన చెప్పారు. దేశ భద్రతకు సంబంధించిన విషయంపై స్పందించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందన్నారు. మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో ఉగ్రదాడి జరిగినప్పుడు జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో ఓ ఛానల్ కోసం మోదీ షూటింగ్ లో ఉన్నారని చెప్పారు. ఘటన జరిగిన తర్వాత కూడా మూడున్నర గంటలపాటు మోదీ షూటింగ్ లోనే ఉన్నారని విమర్శించారు. సాయంత్రం 6.30 గంటలకు ఉగ్రదాడిపై మోదీ స్పందించారని అన్నారు. ఇంత మారణహోమం జరిగినప్పటికీ ప్రధానికి కనీస సమాచారం కూడా అందలేదా? అని ప్రశ్నించారు.

గతంలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల ఉగ్రదాడి జరిగిందని, ఆ సమయంలో మన్మోహన్ రాజీనామా చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ డిమాండ్ చేశారని గల్లా గుర్తు చేశారు. ఇప్పుడు అదే పనిని వేరేవారు చేస్తే, దేశ వ్యతిరేకులు అని ఎలా అంటారని మండిపడ్డారు. జాతీయతా భావం, దేశ భక్తి అనేది కేవలం మోదీ, బీజేపీల హక్కు మాత్రమే కాదన్నారు. ప్రతి భారతీయుడు దేశభక్తి కలిగినవారేనని చెప్పారు. మోదీని ప్రశ్నించినవారి దేశభక్తిని శంకించడం మంచి పద్దతి కాదన్నారు. పుల్వామా ఘటనను రాజకీయ లబ్ది కోసం బీజేపీ వాడుకుంటోందని విమర్శించారు.

Related posts