telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విజయవాడలో వై.ఎస్ విగ్రహ ఆవిష్కరణ.. టీడీపీకి ఆహ్వానం..

ycp letter to CS on praja vedika building

ఏపీలో అధికార పార్టీ మరియు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఒకే వేదికపైకి రానున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని వైసీపీ, టీడీపీ నేతలకు కూడా ఆహ్వానం పలికింది. కృష్ణానది పుష్కరాల సందర్భంగా విజయవాడలో వైఎస్‌ విగ్రహాన్ని తొలగించిన వివాదం గుర్తుందా? నగరంలోని పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం జంక్షన్‌లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఎస్‌ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉందంటూ గత టీడీపీ ప్రభుత్వ కృష్ణా పుష్కరాల సమయంలో దీన్ని తొలగించింది. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అదే జంక్షన్‌లో, అదే ప్రాంతంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదేమీ అంత విశేషం కాకున్నా ఈ కార్యక్రమానికి పలువురు టీడీపీ ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానించడమే చర్చనీయాంశమయ్యింది.

రేపు విజయవాడలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుంది.. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆహ్వాన పత్రికలో మంత్రులు కన్నబాబు, బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నానితోపాటు టీడీపీలోని కీలక నేతలైన రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్, విజయవాడ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, బీజేపీ నేత సుజనా చౌదరి పేర్లను కూడా ముద్రించారు. శిలాపలకంపై కూడా వీరి పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయిపోయింది. మరి ఈ నేతలు ఆ కార్యక్రమానికి వెళ్తారా? లేదా? అనేదే తేలాల్సిన విషయం.

Related posts