telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఒంగోలు : … మళ్ళీ జూ.ఎన్టీఆర్ వైపు చూస్తున్న.. టీడీపీ…బాబు పలికేనా..

tdp banner on jr.ntr into party

టీడీపీ నాయకత్వం చేతులు మారడమంటూ జరిగితే.. అది ఎవరి చేతుల్లోకి వెళ్లవచ్చు? ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉంది? అనే ప్రశ్నలను టీడీపీకి చెందిన ఏ కార్యకర్తను అడిగినా వారి నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. అదే- జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్‌కు తప్ప తెలుగుదేశం పార్టీ సారథ్య బాధ్యతలను అందుకోగల శక్తి, సామర్థ్యాలు ఏ ఒక్కరికీ లేవనే బాహటంగా చెబుతారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు మనవడిగా జూనియర్ ఎన్టీఆర్‌కు గుర్తింపు ఉంది. అంతకుమించి- చలన చిత్ర పరిశ్రమలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇదివరకే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని ఏటేటా ప్రతి మేలో నిర్వహించే మహానాడు సభలకు క్రమం తప్పకుండా హాజరయ్యే వారు జూనియర్. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోడ్‌షోలను నిర్వహించారు. ఆ తరువాత చోటు చేసుకున్న మనస్పర్థలు, విభేదాల వల్ల దూరం అయ్యారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడి చేతుల్లో కొనసాగుతోంది. నందమూరి కుటుంబం నుంచి చేతులు మారిన టీడీపీ అధ్యక్ష స్థానం ప్రస్తుతం నారావారి ఆధీనంలో ఉంటోంది. అధికారంలో ఉన్నా, లేకపోయినా ఇన్నేళ్లుగా పార్టీని సజీవంగా ఉంచుతూ వస్తున్నారాయన. ఆయన తరువాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కాలనే అంశంపై ఇప్పటిదాకా కూడా ఎక్కడా పార్టీలో చర్చ అనేదే చోటు చేసుకోలేదు. చంద్రబాబు తరువాత.. అనే ప్రశ్నే ఉత్పన్నం కాలేదు.. కానివ్వలేదు కూడా. చంద్రబాబు తరువాత తెలుగుదేశాన్ని మళ్లీ నందమూరి కుటుంబానికే అప్పగించితే బాగుంటుందని, ఆ కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ పార్టీ సారథ్య బాధ్యతలను అందుకోవాల్సి ఉంటుందంటూ సాధారణ కార్యకర్తలు తమ అభిప్రాయాలను ఇదివరకే పలు సందర్భాల్లో వ్యక్తం చేశారు. ప్రత్యేకించి- సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణలో ఈ తరహా డిమాండ్ ఊపందుకునప్పటికీ.. ఆ తరువాత చప్పున చల్లారింది. దానికి ఉన్న కారణాలు వేరే.

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రకాశం జిల్లాలో ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో- జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను ప్రముఖంగా ముద్రించారు. రాబోయే కాలానికి కాబోయే సీఎం అంటూ తాటికాయంత అక్షరాలతో ప్రచురించారు. 2024 నాటికి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పుకొచ్చారు. ఫ్లెక్సీని ఏర్పాటు చేసే ముందు.. జూనియర్‌కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అనుచరులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచీ ఉన్న నాయకుడు కరణం బలరాం. పార్టీ ఉత్థాన, పతనాలను చవి చూసిన వ్యక్తి. చంద్రబాబును మనస్తత్వాన్ని దగ్గరి నుంచి పరిశీలించిన నాయకుడు. అందుకే- చంద్రబాబు తరువాత పార్టీ అధ్యక్ష బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాల్సి ఉంటుందనే సంకేతాలను ఆయన ఈ ఫ్లెక్సీ ద్వారా ఇప్పించినట్లు చెబుతున్నారు. ఈ ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోను ముద్రించకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్టీ రామారావు, కరణం బలరాం, చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సహా ప్రకాశం జిల్లాకు చెందిన పలువురు సీనియర్ నాయకుల ఫొటోలను ఈ ఫ్లెక్సీలో ముద్రించారు. దీనితో- ఉద్దేశపూరకంగానే చంద్రబాబు ఫొటోను ముద్రించలేదని చెప్పకనే చెప్పినట్టయింది. ఈ ఫ్లెక్సీపై తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts