telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

పార్టీలో తన్నీరు పాత్ర తగ్గించే ప్రయత్నం?

TRS Working President KTR Meet Harish Rao
కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టిన అనంతరం తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే  తన్నీరు హరీష్ రావు పాత్రను గులాబీబాస్, తెలంగాణ సీఎం కీసీఆర్  ప్రభుత్వంలోనూ పార్టీలోనూ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని గత కొంత కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ మధ్య కాలంలో హరీష్ రావు వార్తలు టీఆర్ఎస్ కు సంబందించిన ఓ దినపత్రికలో కనిపించడం లేదని స్పష్టమవుతోంది. ఆయనకు సంబంధించిన వార్తలను ఆ ప్రముఖ తెలంగాణ దినపత్రికలో ప్రచురించకూడదని అనధికార ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.
గత మూడు రోజులుగా ఆయనకు సంబంధించిన వార్తలు ఆ దినపత్రికలో  కనిపించడం లేదని పలువురు చర్చింకుకొంటున్నారు. సిద్ధిపేట స్థానిక ఎడిషన్ లో మాత్రం చిన్నపాటి వార్తలు మాత్రం ప్రచురితమవుతున్నాయి. ఎన్నికలకు ముందు హరీష్ రావు వార్తలపై ఆ పత్రిక నిషేధం పట్టినట్టు కూడా అప్పట్లో  జోరుగా ప్రచారం జరిగింది.  గజ్వెల్ నియోజకవర్గంలో మామ కేసీఆర్ గెలుపు కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతూ జోరుగా ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత పూర్తిగా సీన్ మారినట్లు కనిపిస్తోంది. 
కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్ఎస్ లో చేరిపోయారు. నిజానికి వంటేరు ప్రతాప రెడ్డి ఎన్నికలకు ముందు హరీష్ రావుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన ప్రత్యర్థి కేసీఆర్ కాదని, హరీష్ రావు అని అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య సంగారెడ్డి కాంగ్రెసు శాసనసభ్యుడు జగ్గారెడ్డి విచిత్రమైన వ్యూహాన్ని ఎంచుకున్నారు. కేటీ రామారావును ప్రశంసిస్తూ హరీష్ రావును విమర్శిస్తూ వస్తున్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను చూస్తే ఆయన కాంగ్రెసులో కన్నా టీఆర్ఎస్ రాజకీయాలే నడుపుతున్నట్లు కనిపిస్తున్నారు. జగ్గారెడ్డి విమర్శలు ఉమ్మడి మెదక్ జిల్లాలో హరీష్ రావు పాత్రను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఉన్నట్లు పలువురు అంటున్నారు. 
మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనప్పటికీ తాజా పరిణామాలను పరిశీలిస్తే, హరీష్ రావుకు మంత్రివర్గంలో చోటు ఉండకపోవచ్చని తెలుస్తోంది. పార్టీ పగ్గాలను చేతుల్లోకి తీసుకున్న కెటీఆర్ ను పక్కన పెడుతూ ఏ బాధ్యతలూ లేని హరీష్ రావును కూడా పక్కన పెట్టే ఎత్తుగడలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సారి కేసీఆర్ మంత్రివర్గంలో కొత్త వారికి బెర్తులు దక్కే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది.

Related posts