telugu navyamedia
క్రైమ్ వార్తలు

జర్నలిస్టులపై తాలిబన్లు కర్కశత్వం

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోయారు. ఇప్పటికే స్వేచ్ఛ కోసం పోరాడుతున్న మహిళలను ఎక్కడికక్కడ అణచివేస్తున్న తాలిబన్లు. ఆ ఆందోళనలను కవర్‌ చేస్తున్న జర్నలిస్టులపైనా కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. అత్యంత దారుణంగా వారిపై దాడులు చేస్తున్నారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు జర్నలిస్టుల ఫొటోలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పశ్చిమ కాబుల్‌లోని కర్తే ఛార్‌ ప్రాంతంలో తాలిబన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు మహిళలు బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనను అడ్డుకున్న తాలిబన్లు.. దీన్ని కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాడులకు తెగబడ్డారు. అఫ్గాన్‌ మీడియా సంస్థ ఎట్లియాట్రోజ్‌కు చెందిన వీడియో ఎడిటర్‌ తాఖీ దర్యాబీ, రిపోర్టర్‌ నెమతుల్లా నక్దీలను తాలిబన్లు తీసుకెళ్లి వారి పట్ల అమానుషంగా ప్రవర్తించారని సదరు మీడియా సంస్థ వెల్లడించింది. వారిని తీవ్రంగా కొట్టారని తెలిపింది. ఆ తర్వాత కొంతసేపటికి వారిని విడిచిపెట్టినట్లు పేర్కొంది. శరీరంపై గాయాలతో ఉన్న జర్నలిస్టుల ఫొటోలను ఆ సంస్థ ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది.

వారి చెర నుంచి విడుదలైన అనంతరం బాధితుడు నక్దీ మీడియాతో మాట్లాడారు. ‘ఒక తాలిబన్‌ నా తలపై కాలు పెట్టి నలిపేశాడు. మొఖాన్ని కూడా చిదిమేశాడు. తర్వాత తలపై తన్నాడు. నన్ను చంపేస్తారని అనుకున్నా’ అని వాపోయాడు. ‘నువ్వు వీడియోలు చిత్రీకరించవద్దు’ అని హెచ్చరించినట్లు తెలిపాడు. ఈ ఘటనపై జర్నలిస్టు లోకం దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. వీరిపై దాడిని జర్నలిస్ట్‌ లోకం ఖండిస్తోంది.

Related posts