telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

సమావేశాలు వాయిదా వేయాలన్న మతపెద్దలు… పట్టించుకోని తబ్లీగ్ జమాత్ చీఫ్…?

Jamath

దేశంలో కరోనా వైరస్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడానికి ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ ప్రార్థనలు కారణమైన విషయం తెలిసిందే. మార్చి 1 నుంచి 15 వరకు జరిగిన మర్కజ్ మత సమ్మేళనంలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో చాలా మంది వైరస్ బారినపడగా.. వారితో సన్నిహితంగా మెలిగినవారికి ఈ మహమ్మారి సోకింది. అయితే, దీనికంతటికీ తబ్లీగ్ జమాత్ చీఫ్ మౌలానా మొహమూద్ సాద్ కంధాల్వాయ్ కారణమనే వాదన వినబడుతోంది. మార్చి తొలివారంలోనే దేశంలో కరోనా వైరస్ కేసులు వెలుగు చూడటంతో సమ్మేళనాన్ని తక్షణమే వాయిదా వేయాలని పలువురు సీనియర్ మతపెద్దలు చేసిన సూచనలను ఆయన పట్టించుకోలేదు. తన పంతాన్ని నెగ్గించుకోడానికి, గుడ్డి విశ్వాసాన్ని చాటుకోవడానికి మొండి వైఖరితో వందలాది అనుచరుల జీవితాలను ప్రమాదంలో పడేయడమే కాదు ముస్లింలపై నమ్మకం కూడా సన్నగిల్లిపోయేలా చేశాడని పలువురు ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. మర్కజ్‌కు హాజరైన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కాగా, సాద్, అతడి కొద్ది మంది సలహాదారు అజ్ఞాతంలో ఉన్నారు.

బాధ్యతాయుతమైన ముస్లిం మేధావులు ఎందుకు ఇలాంటి సలహా ఇచ్చారు?.. అతడు వైద్య పరీక్షలు చేయించుకోకుండా ఎందుకు దాక్కున్నాడని తబ్లీగ్ జమాత్ మాజీ సభ్యుడు లియాఖత్ అలీ ఖాన్ ప్రశ్నించారు. మత సమ్మేళనాన్ని వాయిదా వేయాలని పదే పదే కోరినా వాటిని సాద్ పెడచెవిని పెట్టి, తబ్లీగ్ జమాత్ అనుచురులను ప్రమాదం అంచుకు నెట్టాడని అతడి సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ నేత మీమ్ అఫ్జల్, మరో ముస్లిం పెద్ద జఫర్ సరేషావాలా సైతం ఈ ప్రార్థనలను వాయిదావేయాలని సలహా ఇచ్చినట్టు మీడియాకు వెల్లడించారు. తమ సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. మౌలానా సాద్ మాత్రం తన షెడ్యూల్ చేసిన కార్యక్రమాన్ని కొనసాగించాలనే పట్టుదలను ప్రదర్శించారు. అంతేకాదు.. మసీదులో ప్రాణాలు కోల్పోవడం ఎంతో ఉత్తమం అని సాద్ వ్యాఖ్యానించిన ఓ ఆడియో టేపు ఇప్పుడు వైరల్‌గా మారింది. తబ్లీగ్ జమాత్‌కు చెందిన ఓ సీనియర్ మతపెద్ద మొహమూద్ ఆలం మాట్లాడుతూ.. సాద్‌కు అన్ని విషయాలు తెలుసని, కానీ, అతడి మొండివైఖరి అమాయకులైన తబ్లీగ్‌లను ఓ మహమ్మారి కోరల్లోకి నెట్టేసిందన్నారు. ప్రపంచంలోని ముస్లింలకు అమీర్ అని చెప్పుకునే సాద్.. మక్కా, మదీనా తరువాత తబ్లిగి మర్కాజ్‌ను అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పేర్కొన్న వ్యక్తి.. కరోనావైరస్ మహమ్మారి గురించి ఎంత అజ్ఞానంతో వ్యవహరించాడని మండిపడ్డారు. కాగా, సాద్ సన్నిహితులు మౌలానా హారిస్ మాట్లాడుతూ.. తబ్లీగ్ జమాత్ ప్రార్థనలకు విదేశీయులను కేంద్రం ఎందుకు అనుమతించిందని, వారి అడ్డుకోకపోవడం తమ తప్పు ఎలా ఉందని ప్రశ్నించడం గమనార్హం. ఇదిలా ఉండగా… ఢిల్లీలోని తుర్కమన్ గేట్ వద్ద ఉన్న తబ్లీగ్ జమాత్‌కు సమాంతరంగా ఉన్న షురా ఇ జమాత్ మాత్రం దేశంలో కరోనా వైరస్ కేసులు నమోదుకావడంతో తక్షణమే తన కార్యకలాపాలను రద్దుచేసింది.

Related posts