telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా” 12 రోజుల వసూళ్ళు… ఎక్కడ హిట్టు… ఎక్కడ ఫట్టు…?

Syeraa

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా విడుదల చేశారు. ఈ చిత్రం విడుదలై 12 రోజులు గడిచిపోయింది. ఈ చిత్రం తెలుగులో సత్తా చూపిస్తుంది. 12 రోజుల్లో 100 కోట్ల షేర్ అందుకుంది సైరా. ఇది కేవలం తెలుగు వర్షన్.. అందులో తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. దసరా సెలవులను బాగా క్యాష్ చేసుకుంటూ రచ్చ చేసాడు చిరంజీవి. నైజాంలో 31 కోట్ల షేర్ అందుకుని.. లాభాల్లోకి వచ్చేసింది ఈ చిత్రం. ఆంధ్రాలో కూడా 72 కోట్ల మైలురాయి అందుకుంది సైరా. తెలంగాణలో మరో వారం సెలవులు రావడంతో సైరాకు మరింత కలిసి రానుంది. ఓవర్సీస్‌లో కూడా 2.5 మిలియన్ మార్క్ అందుకుంది ఈ చిత్రం. హిందీలో మాత్రం సైరా ఊహించిన వసూళ్లు తీసుకురావడం లేదు. ఈ చిత్రం అక్కడ 10 కోట్ల షేర్ అందుకుంది అంతే. తెలుగు రాష్ట్రాల్లోనే ఇప్పటి వరకు 99.93 కోట్ల షేర్ వసూలు చేసిన సైరా.. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ 135 కోట్ల షేర్ వసూలు చేసింది. బాహుబలి 2 తర్వాత ఆ స్థాయిలో పర్ఫార్మ్ చేసిన తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. ఇక తమిళనాడులో కూడా ఆశించిన స్థాయిలో సైరా వసూళ్ళు రావడం లేదు. కానీ కన్నడలో మాత్రం దుమ్ము దులిపేస్తుంది ఈ చిత్రం. మొత్తానికి సైరా 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 135 కోట్ల షేర్ అందుకుంది.. గ్రాస్ 210 కోట్లకు పైగానే ఉంది. ఖైదీ నెం 150 తర్వాత వరసగా రెండోసారి కూడా 100 కోట్ల షేర్ అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడు మెగాస్టార్. 170 కోట్లు దాటితే కానీ సైరా సేఫ్ అనిపించుకోదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే తెలుగులో మాత్రమే సైరా విజయం అందుకునేలా కనిపిస్తుంది.

Related posts