telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సైరా నరసింహా రెడ్డి”పై ఆరోపణలు… నిజమేనా ?

Sye-Raa

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 151వ చిత్రం “సైరా నరసింహా రెడ్డి”. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు, రవికిషన్, తమన్నా, నిహారిక తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 20న విడుదల చేశారు. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది.

బ్రిటీష్‌వారిపై భార‌తీయులు చేసిన ప్ర‌థ‌మ స్వాతంత్ర్య స‌మ‌రం 1857లో జ‌రిగింద‌ని చ‌రిత్ర మ‌న‌కు చెబుతుంది. అయితే అంత కంటే ముందుగానే ఓ తెలుగు వీరుడు బ్రిటీష్‌వారికి ఎదురు నిలిచారు. ఆయ‌నే ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. చ‌రిత్ర మ‌ర‌చిపోయిన ఈ వీరుడి క‌థ‌ను `సైరా న‌ర‌సింహారెడ్డి`గా వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. అయితే ఈ సినిమాపై కొంద‌రు చ‌రిత్ర కారులు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ట‌. అవేంటంటే ఉయ్యాల‌వాడ తొలుత బ్రిటీష్‌వారి ఆధీనంలో పాలెగాడుగా వ్య‌వ‌హ‌రిస్తుండేవాడ‌ని, ఆయ‌న‌కు, ఓ బ్రిటీష్ అధికారికి జ‌రిగిన గొడ‌వ క్ర‌మంగా పెద్ద‌ది కావ‌డంతో అది పోరుగా దారి తీసింద‌ని అంటున్నారు కొంద‌రు చ‌రిత్ర‌కారులు. అంటే వారి వాద‌న ప్ర‌కారం త‌న ప్రాంతం, త‌న హ‌క్కుల కోస‌మే ఉయ్యాల‌వాడ పోరాడాడు త‌ప్ప‌.. దేశ‌భ‌క్తితో కాద‌ని అంటున్నారు. అయితే మ‌రికొంద‌రు ఆ ఆరోప‌ణ‌ల్లో ప‌స లేద‌ని.. ప్ర‌థ‌మ స్వాతంత్ర్య స‌మ‌రం కూడా తొలుత‌ హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ కోస‌మే ప్రారంభ‌మైంద‌ని… ఎవ‌రూ స్వాతంత్ర్యం కావాల‌ని పోరాడ‌లేదని త‌ర్వాత రూపాంత‌రం చెందింద‌ని అంటున్నారు. ఈ ఆరోప‌ణ‌లు ఎలా ఉన్న‌ప్ప‌టికీ బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి వీరుడు మ‌న తెలుగువాడు కావ‌డం మ‌న గొప్ప‌త‌నం.

Related posts