telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

స్వచ్ఛ ర్యాంకులు 2020 .. ప్రక్రియ ప్రారంభం.. 12 ప్రశ్నలతో..

swacch sarvekshan 2020 started

సర్వేక్షణ్-2020లో భాగంగా నగరాలకు ర్యాంకులు నిర్ణయించే ప్రక్రియ మొదలైంది. ఈసారి ప్రజాభిప్రాయ సేకరణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా 12 ప్రశ్నలకు ప్రజలను అడిగి వారిచ్చే సమాధానాల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. ర్యాంకు నిర్థారణలో ఈ ప్రక్రియ కీలకంగా ఉంటుంది. ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా విభజించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్-2020గా పేర్కొనే మూడు త్రైమాసిక మూల్యాంకనం ద్వారా స్వచ్ఛతపై నగరాలకు మార్కులను కేటాయిస్తారు. ఏప్రిల్-2019 నుంచి జూన్ వరకు మొదటి త్రైమాసికం,జూలై నుంచి సెప్టెంబర్, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రెండు, మూడు త్రైమాసికాలు ఉంటాయి. ఈ సందర్భంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మెట్రోసిటీల్లో చేపట్టిన స్వచ్ఛ కార్యక్రమాలపై నివేదికలను స్వచ్ఛభారత్ మిషన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో త్రైమాసికానికి రెండు వేల చొప్పున మార్కులను కేటాయిస్తారు. ఈ మూడు త్రైమాసికాల్లో అప్‌లోడ్ చేసిన నివేదికల ఆధారంగా మార్కులను స్వచ్ఛభారత్ మిషన్ కేటాయిస్తుంది.

గత మూడు త్రైమాసికాల్లో వచ్చిన మార్కుల్లో 50శాతం మార్కులను చివరగా నిర్వహించే(నాలుగో సర్వే) సర్వేలో వచ్చిన మార్కులకు కలుపుతారు. ఈ రెండింటిని కలుపగా వచ్చిన మార్కులు ర్యాంకుకు ప్రాతిపదికగా ఉంటుంది. ఇలా దేశవ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మెట్రో నగరాలు సాధించిన మార్కుల ఆధారంగా స్వచ్ఛ సర్వేక్షణ్-2020 ర్యాంకింగ్‌లను ప్రకటిస్తారు. అలాగే, మున్సిపల్ సంస్థలు, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో చేపట్టిన అంశాలపై సమర్పించే నివేదికల ఆధారంగా స్వచ్ఛ భారత్ మిషన్ ప్రతినిధులు నగరవాసులను 12 రకాల ప్రశ్నలు అడుగుతారు. వీటికి ప్రజలిచ్చే జవాబుల ఆధారంగా మెరుగైన ర్యాంకు లభించే వీలుంది.

ప్రజలను ఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు :
1. మీ ఇంటి నుంచి ప్రతిరోజూ చెత్త సేకరిస్తున్నారా?
2. చెత్తను తడి, పొడి చెత్తగా విడదీసి ఇవ్వాలని గార్బేజ్ కలెక్టర్ మిమ్మల్ని అడుగుతున్నారా?
3. మీ పరిసర ప్రాంతాల్లో చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలపై సంతృప్తి చెందుతున్నారా?
4. మీ నగరంలో వేడుకల సందర్భంగా మంచినీరు, జ్యూస్‌లను తాగేందుకు ప్లాస్టిక్ గ్లాస్‌లను అతితక్కువగా ఉపయోగించే అంశాన్ని గమనిస్తున్నారా?
5. మీ నగరంలో ఫుడ్ బ్యాంక్, క్రాకరీ బ్యాంక్‌ల ద్వారా ఆహారాన్ని వృథా కాకుండా చేయడం, వ్యర్థ వస్తువులను రీసైక్లింగ్ చేయాలని కోరుతూ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గమనించారా?
6. భవన నిర్మాన వ్యర్థాలు మీ ఇంటి సమీపంలో, రహదారిలో రెండు, మూడు రోజులకుపైగా ఉన్నట్లు గమనిస్తున్నారా?
7. మీ నగరం/ కాలనీలో కంపోస్ట్ ఎరువుల తయారీని ప్రోత్సహిస్తున్నారా… మీరు హోమ్ కంపోస్ట్‌ను చేస్తున్నారా?
8. మీ నగరంలో పబ్లిక్ టాయిలెట్లు ఏ లొకేషన్లో ఉన్నాయి? పబ్లిక్ టాయిలెట్లు సమీపంలో ఎక్కడ ఉందనే సమాచారాన్ని తెలుసుకోడానికి గూగుల్ మ్యాప్‌ను ఉపయోగిస్తున్నారా?
9. మీ నగరంలో పాఠశాలలు, హోటళ్లు, వైద్యశాలలు, ఆర్‌ర్‌డబ్ల్యూలు, ప్రభుత్వ కార్యాలయాలకు స్వచ్ఛ ర్యాంకింగ్‌లు ఇస్తున్నారనే విషయం మీకు తెలుసా?
10. స్వచ్ఛభారత్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మీకు అవకాశం లభించిందా? ప్రైవేటు రంగం, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొంటున్నాయా?
11. స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్-2020లో మీ నగరం పాల్గొంటున్న విషయం మీకు తెలుసా?
12. మీ నగరంలో పబ్లిక్ టాయిలెట్లు, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ సరిగా ఉందా?

Related posts