telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో రైనా మరో రికార్డు…

ఐపీఎల్ లో టీమిండియా వెటరన్ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ వైస్ కెప్టెన్ సురేశ్ రైనా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌తో కలుపుకొని రూ.100 కోట్ల వేతనం తీసుకున్న ఆటగాడిగా సురేశ్ రైనా గుర్తింపు పొందనున్నాడు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.150 కోట్లు తో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మరూ.131 కోట్లు తో , విరాట్ కోహ్లీ రూ.126 కోట్లు తో రైనా కన్నా ముందున్నారు. ఇక యూఏఈ వేదికగా జరిగిన గత సీజన్‌ నుంచి రైనా వ్యక్తిగత కారణాలతో అర్థాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. జట్టుతో దుబాయ్‌కి వెళ్లిన రైనా.. అనూహ్యంగా తిరుగుపయనమయ్యాడు. ఇది చెన్నై బ్యాటింగ్‌ ఆర్డర్‌పై పెను ప్రభావం చూపింది. జట్టు కూర్పు ఏమాత్రం కుదరలేదు. దీంతో సీఎస్‌కే లీగ్‌ చరిత్రలోనే అత్యంత నిరాశజనకమైన ప్రదర్శనతో నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో సురేశ్‌ రైనాకు చెన్నై ఫ్రాంచైజీ మంగళం పాడటం ఖాయమనే వార్తలొచ్చాయి. అప్పట్లో ఫ్రాంచైజీ యజమాని, బీసీసీఐ మాజీ చీఫ్‌ శ్రీనివాసన్‌ కూడా సూచనప్రాయంగా ఇదే చెప్పారు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా వచ్చే సీజన్ కోసం సురేశ్ రైనాను రిటైన్ చేసుకుంది. దాంతో వచ్చే సీజన్ కోసం చెన్నై.. రైనాకు రూ.11 కోట్లు చెల్లించనుంది. దీంతో కలుపుకొని ఐపీఎల్‌లో రైనా సంపాదన రూ.100 కోట్ల మార్క్‌ను దాటుతుందని ఇన్‌సైడ్ స్పోర్ట్ మనీబాల్ తెలిపింది. ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నైకి ఆడిన సురేశ్ రైనా.. ఫిక్సింగ్ ఆరోపణలతో సస్సెన్షన్‌కు గురైన రెండేళ్లు గుజరాత్ లయన్స్‌కు ఆడాడు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ రీఎంట్రీ ఇవ్వగా.. రైనా మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆ సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 445 పరుగులు చేసి జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2021 మినీ వేలం కోసం చెన్నై తమ రిటైన్, రిలీజ్ ప్లేయర్ల జాబితాను ప్రకటించింది.

Related posts