telugu navyamedia
క్రీడలు

క్రికెటర్ సురేశ్​ రైనా సంచలన నిర్ణయం..క్రికెట్‌కు గుడ్‌బై

*సురేష్‌ రైనా సంచలన నిర్ణయం..
*అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా

టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్​ సురేశ్​ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో అతడు ఐపీఎల్​కు కూడా వీడ్కోలు పలికినట్లు అయింది. ఇన్నేళ్ల పాటు ఈ దేశానికి, తన రాష్ట్రం యూపీకి ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

ఈ రోజు నేను అన్ని ఫార్మాట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. అదే విధంగా నా కెరీర్‌లో మద్దతుగా నిలిచిన బీసీసీఐ, యూపీ క్రికెట్ అసోసియేషన్‌కు, సీఎస్కేకు, రాజీవ్ శుక్లాకు నా అభిమానులకు ధన్యవాదాలు” అంటూ రైనా ట్విటర్‌లో పేర్కొన్నాడు.

2005లో వన్డే క్రికెట్‌లో అరంగేట్రం చేసిన రైనా.. టీమ్​ఇండియా తరఫున 266 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 7,988 పరుగులు నమోదు చేయగా.. ఒక్క వన్డేల్లోనే 5615 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 116 పరుగులు చేసిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మన్‌ మొత్తం ఐదు సెంచరీలు, 36 అర్ధశతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 36 వికెట్లు కూడా తీశాడు. 2010లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రైనా.. 18 టెస్టుల్లో 768 పరుగులు సాధించాడు.

భారత మెగా క్రికెట్‌ లీగ్‌లో తొలుత పంజాబ్‌ జట్టుకు ఆడిన రైనా.. ఆ తర్వాత చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు. ఈ టోర్నీలో మొత్తంగా 205 మ్యాచ్‌లు ఆడిన అతడు 5528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 అర్ధశతకాలు ఉన్నాయి. 25 వికెట్లు కూడా తీశాడు. 2020లో టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. టీ20 మెగా లీగ్‌లో వీరిద్దరూ కలిసి చెన్నై జట్టుకు ఆడిన విషయం తెలిసిందే.

ఇక 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రైనా.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ వచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో పాల్గొన్న రైనాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వేలంలో అమ్ముడుపోని ఆటగాడిగా మిస్టర్‌ ఐపీఎల్‌ మిగిలిపోయాడు.

Related posts