telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమరావతి భూముల వివాదం : వర్ల రామయ్యకు నోటీసులు జారీ

amaravathi ap

అమరావతి భూముల వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. అమరావతి భూ కుంభకోణం దర్యాప్తుపై హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ అశోకభూషన్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎమ్.ఆర్. షా లతో కూడిన తిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. “సిట్” (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. రాష్ట్ర కేబినెట్ జూన్ నెలలో “సిట్” (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుందని.. మొత్తం ప్రక్రియ పారదర్శకంగా సాగుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో “సిట్” దర్యాప్తుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వడం సరికాదని…“సిట్” దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు. కొందరు ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులో “సిట్” దర్యాప్తుపై పిటిషన్లు వేశారని.. వ్యక్తిగతంగా ప్రభావితమైతే తప్ప ఆర్టికల్ 226 ప్రకారం రిట్ దాఖలు చేయలేరని తెలిపారు. “సిట్” దర్యాప్తుతో వారికి ఎలాంటి సంబంధం లేదని… తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించి తమ పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని పేర్కొన్నారు. కేంద్రాన్ని, కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతివాదులుగా చేర్చారా అని ప్రశ్నించిన ధర్మాసనం….కేంద్రం, ఈడీ ఇంప్లీడ్‌మెంట్ పిటిషన్లను తోసిపుచ్చినట్టు వెల్లడించింది.  టీడీపీ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను ఈ ప్రభుత్వం సమీక్షిస్తుందా? అని ప్రశ్నించింది ధర్మాసనం. అన్నీ కాదు, పెద్ద ఎత్తున అక్రమాలు జరిగిన అంశాల్లో మాత్రమేనంటూ ఏపి ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే బదులిచ్చారు. హైకోర్టుకు అసాధారణ అధికారాలు లేవని, సుప్రీం ఆదేశాలకు లోబడాల్సిందేనని వెల్లడించిన దవే… తన వాదనను బలపర్చే గత తీర్పులను ఉదహరించారు. రాజధాని భూసేకరణలో అక్రమాలు
జరిగాయన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా సిబిఐ విచారణ కోరితే, అంతకంటే రాష్ట్ర ప్రభుత్వ నిబధ్దతకు, చిత్తశుద్ధికి నిదర్శనం ఏమి కావాలని ధర్మాసనం ముందు దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. వాదనలు విన్న సుప్రీం..ఈ విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. అంతేకాదు..తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్యకు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.

Related posts